మే 4న జరిగిన మణిపూర్ మహిళల వీడియో ఘటన కేసుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. రాష్ట్రంలో CBI విచారణను వ్యతిరేకిస్తున్నామని కుకీల తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇందుకు ఆల్టర్నేటివ్ గా రిటైర్డ్ DGPలతో కూడిన సిట్(SIT)తో విచారణ జరపాలని.. ఈ సిట్ లో మణిపూర్ అధికారులెవరూ ఉండకూడదని కోరారు. ఇలాంటి ఘటనలు ఇతర రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయని, బెంగాల్ లో మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన మరో ఘటనను ఇంకో లాయర్ ప్రస్తావించారు.
మణిపూర్ లో మహిళలే లక్ష్యంగా హింస జరుగుతోందని, స్త్రీల కుటుంబీకుల్ని చంపేస్తున్నారని బాధితుల తరఫు లాయర్ కపిల్ సిబల్ తెలిపారు. అత్యాచార బాధితులు బయటకొచ్చి మాట్లాడలేరని, CBI ఇన్వెస్టిగేషన్ జరిగినా ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఉందని లాయర్ ఇందిరా జైసింగ్ వివరించారు. CBI విచారణకు బదులు ఉన్నతస్థాయి కమిటీ విచారణ జరగాలని ఆమె కోరారు. ఈ కేసులో దాఖలైన పిటిషన్లను CJI డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేస్తోంది. మణిపూర్ అల్లర్లపై ఇన్వెస్టిగేషన్ ను సుప్రీం పర్యవేక్షిస్తే కేంద్రానికి అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు.
అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పడంలో డౌట్ లేదని, అన్ని కేసులను మణిపూర్ కోణంలో చూడలేమని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. హింసను ఎదుర్కోవడానికి విస్తృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అంతకుముందు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మే నుంచి ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్లపై అన్ని FIRలు నమోదయ్యాయా అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది.