ఇటీవలి కాలంలో ఛత్తీస్ గఢ్(Chattisgarh)లో వరుసగా చోటుచేసుకుంటున్న ఎన్ కౌంటర్లలో భారీగా మృత్యువాత పడుతున్న మావోయిస్టులు.. పోలీసులపై మెరుపుదాడికి దిగారు. భారీస్థాయిలో మందుపాతర పేల్చి 10 మంది జవాన్లను బలి తీసుకున్నారు. కూంబింగ్ నుంచి తిరిగి వెళ్తుండగా అంబోలి బ్రిడ్జి వద్ద ఐఈడీ పేలుడుతో వాహనంలో ప్రయాణిస్తున్న 15 మంది డిస్ట్రిక్ట్ రెవెన్యూ గార్డ్స్(DRG)లో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. జిల్లా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన పేలుడు ధాటికి వాహనం తునాతనకలు కాగా.. మిగతా ప్రాంతాల్లోని బలగాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
2023 డిసెంబరులో విష్ణుదేవ్ సాయ్ సర్కారు కొలువుదీరాక భారీ స్థాయిలో ఎన్ కౌంటర్లు జరిగాయి. అబూజ్ మడ్, సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో 50 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని మూడు రాష్ట్రాలను కలిపే జంక్షన్ అడవుల్లో కొన్ని నెలలుగా భారీగా కూంబింగ్ జరుగుతోంది. నిన్న(జనవరి 5న) అబూజ్ మడ్ ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులతోపాటు ఒక జవాను మృతిచెందారు. ఇలాంటి పరిస్థితుల్లో అదను కోసం వేచిచూస్తున్న మావోయిస్టులు.. జవాన్ల వాహనాన్ని పేల్చారు.