మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దళానికే కీలకంగా భావించే జోనల్ కమిటీకి చెందిన ముఖ్య నాయకులు మృత్యువాత పడ్డారు. ఛత్తీస్ గఢ్(Chattisgarh)-ఒడిశా(Odisha) సరిహద్దు గరియాబంద్ జిల్లా మైన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గత 36 గంటలుగా ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాల జాయింట్ ఆపరేషన్లో ఇప్పటికే 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. కోబ్రా బెటాలియన్, CRPF సిబ్బంది కూంబింగ్ లో పాల్గొనగా.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కమిటీ ప్రముఖ్ అయిన చలపతి అలియాస్ జయరామ్ మృతుల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈయనపై గతంలో రూ. కోటి రివార్డు ఉంది.
దండకారణ్యం జోనల్ కమిటీలోని మరో ఇద్దరు నాయకులు మృతి చెందగా, 14 మంది మృతుల్లో ఇంకో ఇద్దరు మహిళలున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డూ కూడా ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. గత గురువారమే ఛత్తీస్ గఢ్ లో 17 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండలంలోని మారేడుబాక – ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలోనూ రెండు వేల మంది జవాన్లు జల్లెడ పడుతున్నారు.