ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సర్కారు తెచ్చిన బుల్డోజర్ వ్యవస్థ ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో చూశాం. నేరస్థుల ఇళ్లను కూల్చడం, అక్రమార్కులకు నిలువ నీడ లేకుండా చేయడం బుల్డోజర్(Bulldozer) మార్క్ సొంతం. దీనిపై గతంలో విమర్శలు గుప్పించిన అక్కడి ప్రతిపక్ష పార్టీలు.. ఇప్పుడు అదే బుల్డోజర్ వ్యవస్థ రావాలంటున్నాయి. స్వయంగా మాయావతే కోరుకుంటున్నారంటే అసలేం జరిగిందో చూద్దాం…
అందుకోసమే…
అయోధ్యలోని ఒక బేకరీలో పనిచేసే 12 ఏళ్ల బాలికపై గురువారం అత్యాచారం జరిగింది. రెండు నెలలకు పైగా ఇదే ఘోరం జరగడంతో సదరు బాలిక గర్భం దాల్చింది. ఈ కేసులో బేకరీ ఓనర్ మొయిద్ ఖాన్, అక్కడ పనిచేసే రాజు అనే వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఓనర్ మెయిద్ ఖాన్ సమాజ్ వాదీ పార్టీ(SP)లో పనిచేస్తున్నాడు.
నిందితులకు DNA టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న మాయావతి.. యోగి మార్క్ అయిన బుల్డోజర్ యాక్షన్ కావాలంటున్నారు. కులం, సామాజికవర్గం, రాజకీయ వ్యవహారాల వంటివి ప్రభావం చూపిస్తున్న పరిస్థితుల్లో బుల్డోజర్ యాక్షన్ రావాల్సిందేనంటున్నారామె. మహిళలపై నేరాలు తగ్గి శాంతిభద్రతలు అదుపులోకి రావాలంటే బుల్డోజర్ వ్యవస్థ మళ్లీ చూపించాలి.. ఈ విషయంలో సర్కారు చొరవ చూపాలి అని కోరారు మాయావతి.