
ప్రధాని నరేంద్ర మోదీకి ఇంటర్నేషనల్ అవార్డులు అందుతూనే ఉన్నాయి. ఈజిప్టు టూర్ వెళ్లిన ఆయనకు అక్కడి ప్రభుత్వం అత్యున్నత అవార్డు అయిన ‘ఆర్డర్ ఆఫ్ ద నైల్’తో సత్కరించింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మోదీ ఇప్పటివరకు 13 అవార్డులు అందుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం పపువా న్యూగినియా, ఫిజీ విజిట్ చేసిన ప్రధానికి.. అక్కడి ప్రభుత్వాలు అత్యున్నత అవార్డులు అందించాయి. పసిఫిక్ ద్వీప దేశాల యూనిటీ లక్ష్యంగా ‘గ్లోబల్ సౌత్’ కోసం కృషి చేసినందుకు 2023 మేలో ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు’ అందజేసి పపువా న్యూగినియా తన గౌరవాన్ని చాటుకుంది.

యూఎస్, రష్యా సహా అన్ని..
మోదీ విజనరీ, భారత్ తో దశాబ్దాల నుంచి ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు ప్రతీకగా రష్యా.. భారత్ ప్రధానికి 2019లో ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ’ అందజేసింది. ఇక అమెరికన్ మిలిటరీ బెటాలియన్లలో అత్యుత్తమ సేవలు, ఎన్నో విజయాలు సాధించిన వారికి అందించే ‘లీజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును మోదీకి ఆ దేశం ఇచ్చి సత్కరించింది. మాల్దీవ్స్, భూటాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, పాలస్తీనా, అప్ఘనిస్తాన్ తోపాటు ఎన్విరాన్ మెంట్, ప్రపంచ శాంతి సహా వివిధ సంస్థల అవార్డులు ప్రధానికి దక్కాయి.