సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, CM తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్న సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీ సైతం దీనిపై సీరియస్ అయ్యారు. జీ20 సమ్మిట్ ఏర్పాట్లపై మంత్రివర్గంతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన కామెంట్స్ ని తేలిగ్గా తీసుకోకూడదని మంత్రివర్గ సహచరులకు మోదీ సూచించారు. వివిధ దేశాల అధినేతలు మన దేశంలో అడుగు పెడుతున్న ఈ సమయంలో ఇలా దేశ సంస్కృతినే కించపరిచేలా మాట్లాడటాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై అందరూ గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరముందని మంత్రులకు సూచించారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై ఇప్పటికే పీఠాధిపతులతోపాటు దేశవ్యాప్తంగా BJP నేతలు మండిపడుతూ ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ సనాతన ధర్మంపై తాను చేసిన కామెంట్స్ ను సమర్థించుకుంటూ ఉదయనిధి.. మరోసారి ప్రకటన చేశారు. దీనిపై వెనక్కు తగ్గేది లేదని, ఎవరేం చేసుకున్నా భయపడేది లేదని కరాఖండీగా చెప్పడంతో.. BJP కేంద్ర పెద్దల్లో ఆగ్రహం కనిపించింది. దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటంపై గట్టిగానే బదులు చెప్పాలన్న ధోరణి కేంద్ర మంత్రుల్లో స్పష్టమైనట్లు తెలుస్తున్నది.