మందిర్-మసీదు కేసులపై RSS చీఫ్ మోహన్ భగవత్, UP సీఎం యోగి ఆదిత్యనాథ్ భిన్నమైన రీతిలో స్పందించారు. దేశంలో మత సామరస్యం వెల్లివిరియాలని, భారత్ విశ్వగురు అన్న సందేశాన్ని ప్రపంచానికి అందించాల్సి ఉందని భగవత్ అభిప్రాయపడ్డారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ వారసులు ప్రస్తుతం కోల్ కతాలో ఆటోడ్రైవర్లుగా కాలం గడుపుతున్నారని, ఆనాడు చేసిన పాపాలే వారికి అలాంటి గతిని ఇచ్చాయని యోగి అన్నారు. ఇద్దరి మాటల్లోనే చూస్తే…
‘మనం చాలాకాలంగా సామరస్యంగా జీవిస్తున్నాం.. ఈ సామరస్యాన్ని ప్రపంచానికి అందించాలంటే దానికి ఒక నమూనా తయారు చేయాలి.. రామ మందిర నిర్మాణం తర్వాత హిందువులకు లీడర్లుగా మారవచ్చని కొందరు అనుకుంటున్నారు.. మందిర్-మసీదు వివాదాలు లేవనెత్తడం సరికాదు.. ప్రతిరోజూ కొత్త వివాదమే.. దీన్ని ఎలా అనుమతించాలి.. ఇది కొనసాగదు.. బయటి నుంచి వచ్చిన కొన్ని గ్రూపులు బలపడుతున్నాయి.. మళ్లీ పాత పాలన రావాలని చూస్తున్నాయి..’ అని పుణెలో జరిగిన సమావేశంలో భగవత్ అన్నారు.
యోగి ఏమన్నారంటే… ‘ప్రపంచ నాగరికతను రక్షించాలంటే సనాతన ధర్మం, విలువల్ని కాపాడాలి.. సనాతన ధర్మం అందరిపట్లా కారుణ్యాన్ని చాటుతుంది.. అలాంటి గౌరవం కొన్ని దేశాల్లో హిందువులకు దక్కడం లేదు.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లో దాడులు జరుగుతున్నాయి.. ఆలయాలు ధ్వంసమవుతున్నాయి.. హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది నిదర్శనం.. కాశీ, అయోధ్య, సంభాల్, భోజ్ పూర్లో ఆలయాలపై గతంలో దాడులు జరిగాయి.. ఔరంగజేబ్ వారసులు ఆటోడ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది.. హిందూయిజానికి, హిందూ ఆరాధన స్థలాలకు ఔరంగజేబ్ హాని చేయకుండా ఉంటే ఆయన వారసులకు ఈ గతి పట్టేదే కాదు..’ అని అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.