
వీఐపీ వాహనాలు రోడ్లపై చేసే సైరన్లు అంతా ఇంతా కావు. ట్రాఫిక్ ఉన్నప్పుడు సైరన్ ఇచ్చారంటే ఓకే.. కానీ ఎలాంటి ట్రాఫిక్ లేకున్నా తమ దర్జాను చూపించుకోవడానికి డ్రైవర్లు కావాలని సైరన్ ఇస్తుంటారు. కానీ ఇకనుంచి ఈ కుయ్.. కుయ్.. సైరన్లు ఆగిపోనున్నాయి, ఈ సౌండ్ స్థానంలో సంగీత వాద్యాలు వినిపిస్తాయి. ఇందుకోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త విషయాన్ని ప్రకటించారు. భారతీయ సంగీత వాద్యాలైన తబలా, ఫ్లూట్, శంఖం, వయొలిన్ వంటి సౌండ్స్ అమర్చనున్నారు. తద్వారా రోడ్లపైన ప్రశాంత వాతావరణాన్ని కల్పించబోతున్నారు. సౌండ్ పొల్యూషన్ నుంచి ప్రజలకు రిలీఫ్ కల్పించడమే దీని ఉద్దేశమని గడ్కరీ తెలిపారు.
సైరన్ ఇస్తుండటం వల్ల ఎవరో VIP వెళ్తున్నారని పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటారు. కానీ అందులో VIPలు నిజంగా ఉన్నారో లేరో అని తెలుసుకునే పరిస్థితి ఉండదు. వెహికిల్ లో VIPలు ఉన్నా లేకున్నా డ్రైవర్లు మాత్రం సైరన్ మోగిస్తూ సౌండ్ పొల్యూషన్ చేస్తూనే ఉంటారు. అందుకే దేశవ్యాప్తంగా ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల్ని అడ్డుకోవడానికి నాకో అవకాశం దొరికింది అని గడ్కరీ స్పష్టం చేశారు. నిజంగా ఇది అమలైతే రోడ్లపై ఓవరాక్షన్ ఆగిపోతుందని చెప్పవచ్చు. అవసరం ఉన్నా లేకున్నా సైరన్ ఇవ్వడం వల్ల.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లను తీసుకెళ్లే అంబులెన్స్ లు ముందుకు కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి. మరోవైపు తమ డాబు, దర్పం చూపించుకోవడానికి MLAలు సైతం ఈ సైరన్ యూజ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇకనుంచి ఇలాంటి ఓవరాక్షన్ కు అడ్డుకట్ట పడటం సంతోషకరమైన విషయం.