బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాడిన కారు ఇప్పటికీ భద్రంగా ఉంది. ఇటలీలో తయారైన(Italian Made) ఫోర్డ్ 514 కారును 100 సంవత్సరాల నుంచి లాల్ పూర్ కు చెందిన ఛటర్జీ కుటుంబం దాచుకుంది. ఫిజిషియన్ అయిన డాక్టర్ ఫణీంద్రనాథ్ ఛటర్జీ 1932లో ఈ కారును కొన్నారు. అప్పట్నుంచి ఆయన కుటుంబం ఈ వాహనాన్ని భద్రంగా చూసుకుంటూ నేతాజీ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నది.
ఆనాడు ఏం జరిగిందంటే…
నేతాజీని కలకత్తాలోని ఎల్జిన్ రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో బ్రిటిష్ వాళ్లు హౌజ్ అరెస్టు చేసిన సమయమది. 1940లో తెల్లవారి డేగకళ్లున్న రోజుల్లోనే మురి-రాంచీ రైల్వే లైన్ బ్రాడ్ గేజ్ వేస్తున్నారు. ఇదే అదనుగా ఆయన ఆంగ్లేయుల నుంచి తప్పించుకుని మార్చి 18న రైలులో చక్రధర్ పూర్ చేరుకున్నారు. తన సన్నిహితుడైన డాక్టర్ యదుగోపాల్ ముఖర్జీ రాంచీలో ఉండటంతో ఆయన్ను కలిసేందుకు నేతాజీ సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఫణీంద్రనాథ్ కు చెప్పడంతో ఆయనే స్వయంగా కారులో రాంచీ తీసుకెళ్లారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు చేసేందుకు గాను రాంఘర్ చేరుకునే ముందు నేతాజీ.. మార్చి 18నాడే లాల్ పూర్లోని ఫణీంద్రఛటర్జీ ఇంటిని సందర్శించినట్లు ఆయన మనవడు అరూప్ ఛటర్జీ తెలిపారు. 18, 19 తేదీల్లో రాంచీలోనే ఉన్న నేతాజీ ఇదే కారులో ఊరంతా తిరిగారు. మార్చి 20న రాంచీ నుంచి రాంఘర్ వెళ్లేందుకు ఫోర్డ్ 514 కారు నడిపిన బోస్.. ఆ తర్వాత వెనుక సీట్లోకి వెళ్లిపోయారు. అప్పుడు డ్రైవింగ్ ఫణీంద్ర చేస్తే పక్క సీట్లో ముఖర్జీ కూర్చున్నారు. రాంఘర్ మీటింగ్ తర్వాత మళ్లీ స్టీరింగ్ అందుకున్న బోస్.. 60 కిలోమీటర్ల దూరంలోని రాంచీ రైల్వే స్టేషన్ వరకు నడిపి అక్కడ రైలు ఎక్కి కలకత్తా వెళ్లిపోయారు.
ఫణీంద్ర కుటుంబానికి విలువైన వస్తువుగా మారిన ఈ కారును 1997 వరకు వింటేజ్ కార్ ర్యాలీలకు పంపారు. అయితే కాలక్రమేణా దాని విడిభాగాలు(Spare Parts) దొరక్క మెయింటెనెన్స్ కష్టంగా మారింది. కానీ ఆ కుటుంబం దాన్ని వదిలిపెట్టకుండా అలాంటి కారునే 1968లో కొని అందులోని స్పేర్ పార్ట్స్ తీసి నేతాజీ కారుకు అమర్చి వాడుకున్నారు. కారును కండీషన్లో ఉంచేందుకు ఫణీంద్ర తనయుడైన SN ఛటర్జీ రెగ్యులర్ గా ఆన్ చేయగా, ఆయన కుమారుడైన తను 15 రోజులకోసారి ఆ వాహనంలో ఊరంతా తిరిగినట్లు అరూప్ ఛటర్జీ ఆనాటి స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా ఎప్పటికీ సుభాష్ చంద్రబోస్ కారు అమ్మేది లేదని నిర్ణయించింది ఛటర్జీ కుటుంబం.
PHOTO: THE TIMES OF INDIA