
రాష్ట్రానికి చెందిన BJP సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని గవర్నర్(Governor)గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఉత్తర్వులు వెలువరించారు. ఆయనను త్రిపుర గవర్నర్ గా నియమించారు. మరోవైపు ఒడిశా గవర్నర్ గా ఝార్ఖండ్ మాజీ CM రఘుబర్ దాస్ ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. 1983, 1985, 1999 ఎన్నికల్లో మలక్ పేట నియోజకవర్గం నుంచి MLAగా గెలిచిన ఇంద్రసేనా.. 1999లో శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 2004లో నల్గొండ, 2014లో భువనగిరి లోక్ సభ స్థానాలకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
పార్టీ ప్రెసిడెంట్ గా, వివిధ హోదాల్లో
2003-2007 మధ్యకాలంలో BJP రాష్ట్ర అధ్యక్షుడిగా(State President)గా పనిచేశారు. పార్టీలో వివిధ హోదాల్లో సేవలందించిన ఇంద్రసేనారెడ్డిని.. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకు గవర్నర్ గా పంపుతున్నారు. పార్టీ AP ప్రెసిడెంట్ గా పనిచేసిన కంభంపాటి హరిబాబు ప్రస్తుతం మిజోరాం గవర్నర్ గా, బండారు దత్తాత్రేయ హరియాణా గవర్నర్ గా ఉన్నారు. గతంలో BJP రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వి.రామారావు, సీహెచ్ విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయల తర్వాత మరో మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి సైతం గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.