
‘ఒకే దేశం-ఒకే ఎన్నికల(జమిలి)కు’ మరింత సమయం పట్టే అవకాశముంది. దీనికోసం మరిన్ని సంప్రదింపులు అవసరమని న్యాయ కమిషన్ ఒక రిపోర్ట్ ను కేంద్రానికి అందజేసింది. దీనిపై ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలంటే మరిన్ని సంప్రదింపులు అవసరమని అందులో పేర్కొంది. జమిలి ఎన్నికల వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని, రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సి ఉందని గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, 85, 172, 174, 356 సవరణలు జరపాల్సి ఉందని రిపోర్ట్ లో తెలియజేసింది. లోక్ సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎలక్షన్లు నిర్వహించాలంటే చట్టపరమైన అంశాలపై దృష్టిసారించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో జమిలి ఎన్నికలు 2024లో ఉండబోవన్న విషయం మీద న్యాయ కమిషన్ సమర్పించిన రిపోర్ట్ ద్వారా స్పష్టత వచ్చినట్లయింది.
2014 నుంచి ఇప్పటివరకు న్యాయ కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయనాలు పూర్తి చేసిన అనంతరం కేంద్రానికి రిపోర్టులు అందజేశాయి. ఆ రిపోర్ట్ లు పరిశీలించిన తర్వాత మరిన్ని సంప్రదింపులు అవసరమని భావిస్తున్నట్లు న్యాయ కమిషన్ తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలపై ఇప్పటికే కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.