
గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో దిల్లీ(Delhi)లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. యమునా నదికి వరద పోటెత్తి ఉగ్రరూపం దాలుస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ కనపడుతోంది. యమునా నదిలో 206 మీటర్ల ప్రవాహమే గరిష్ఠం కాగా.. ప్రస్తుతం అంతకుమించి 207.71 మీటర్లతో ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. బుధవారం మధ్యాహ్నానికే ప్రమాదకర స్థాయిలో 207.55 మీటర్లతో ఉన్న ప్రవాహం ఆ తర్వాత మరింత పెరిగిందని సెంట్రల్ వాటర్ కమిషన్(CWC) ప్రకటించింది. కొన్ని కాలనీలను వరద ముంచెత్తితే, మరికొన్ని లోతట్టు ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వర్షాలు ఇలాగే ఉండటంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఫ్లడ్ తో డేంజరస్ సిట్యుయేషన్ ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా అక్కడి పోలీసులు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో 144 సెక్షన్ విధించారు.
45 ఏళ్ల తర్వాత యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. 1978లో నది నీటి మట్టం 207.49 మీటర్లకు చేరుకోగానే భారీ వరదలు దిల్లీని ముంచెత్తాయి. ప్రస్తుతం ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డ దృష్ట్యా CM అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లెటర్ రాశారు.