విశ్వవిఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథుడి ఖజానా విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఒడిశాలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలోని బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాల విలువెంతో ఇప్పటికీ ఎవరికీ తెలియడం లేదు. గత 45 ఏళ్లుగా ఆ రహస్యం కొనసాగుతూనే ఉంది. పూరీ రథయాత్రకు మన దేశం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో భక్తులు హాజరై… ప్రతి సంవత్సరం పెద్దయెత్తున కానుకలు సమర్పిస్తుంటారు. ఆభరణాల రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. జగన్నాథుడి ట్రెజరీ అయిన రత్న భండార్ వివరాలు బయటకు రాకుండా 1978 నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే దీనిపై ఒడిశా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(P.I.L.) దాఖలైంది. రత్న భండార్ తెరిచి ఖజానా విలువ బయటపెట్టాలంటూ జూన్ 30న పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం… రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పూరీ జగన్నాథ క్షేత్రం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ కు నోటీసులు ఇచ్చింది.
జగన్నాథుడి బ్యాంకు డిపాజిట్ల విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. బంగారం, వెండి, ఇతర ఆభరణాల విలువెంతో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. 1978లో రత్న భండార్ ను పరిశీలించినపుడు 128 కిలోల బంగారం, 221 కిలోల వెండి ఉన్నట్లు తేలింది. పూరీ క్షేత్రానికి ఒడిశాలో 60,426 ఎకరాల భూములు ఉండగా… మరో 6 రాష్ట్రాల్లో 322.9 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి. జగన్నాథ టెంపుల్ యాక్ట్ 1955 ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి లెక్కింపు చేపట్టాల్సి ఉన్నా అది అమలు కావడం లేదు. ట్రెజరీని ఇప్పటివరకు 1926, 1978లో మాత్రమే తెరిచి లెక్కించారు. 2018లో రత్న భండార్ ను ఓపెన్ చేసి తనిఖీ చేసేందుకు ఒడిశా సర్కారు యత్నించింది. ఇన్నర్ ఛాంబర్ కు సంబంధించిన తాళాలు దొరక్కపోవడంతో అధికారులు లోపలికి వెళ్లలేకపోయారు.