ఇజ్రాయెల్-హమాస్ వార్ లో పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. ఇరువర్గాల పరస్పర దాడుల్లో సామాన్యులు మృత్యువాత పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ రెండో సమ్మిట్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ విధమైన కామెంట్స్ చేశారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడి దారుణ ఘటన అంటూ ఇప్పటికే భారత్ ఖండించింది. ‘ఇరువర్గాలతో సంభాషణల విషయంలో మేం సంయమనం పాటించాం.. రెండు వర్గాల మధ్య దౌత్యానికి ప్రాధాన్యతనిచ్చాం.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరులో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.. పాలస్తీనా ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ తో మాట్లాడిన తర్వాత మానవతా సాయాన్ని కూడా ఆ దేశానికి అందించాం’ అని సమావేశంలో ప్రధాని గుర్తు చేశారు.
ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ రెండు వర్గాల మధ్య దౌత్యం నెరపాలని పాలస్తీనా, ఇరాన్ వంటి దేశాల నుంచి భారత్ కు విజ్ఞప్తులు వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతోపాటు పాలస్తీనా నాయకత్వంతోనూ మోదీ మాట్లాడినట్లు విదేశాంగశాఖ గతంలోనే ప్రకటించింది. ఇజ్రాయెల్ భూతల దాడులకు పాల్పడటం, హమాస్ తీవ్రంగా ప్రతిఘటిస్తున్న వేళ భారీగా ప్రాణనష్టం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని ఈ కామెంట్స్ చేయడం ఇరుదేశాల పట్ల భారత్ వైఖరిని మరోసారి గుర్తుచేసినట్లయింది.