PHOTO: THE TIMES OF INDIA
పండుగను అందరూ కుటుంబ సభ్యులతో, బంధువులతో జరుపుకొంటారు. కానీ పండుగ, వేడుక అని లేకుండా దేశ సేవలోనే నిమగ్నమవుతారు సైనికులు. అలాంటి సైనికులంతా తన కుటుంబ సభ్యులేనని, అందుకే వారి వద్దకే వెళ్లి పండుగ చేసుకుంటానని భావించారు ప్రధాని మోదీ. అందులో భాగంగానే ఈ దీపావళి సంబరాలను మరోసారి జవాన్లతో జరుపుకొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి సైతం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులతో సంబరాలు నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని హిమాలయ సానువుల్లోని హిమాచల్ ప్రదేశ్ లేప్చాకు చేరుకున్న ఆయన.. అక్కడి సైనికులందరిని కలుసుకున్నారు. దేశానికి విశేష సేవలందిస్తున్న జవాన్లను కొనియాడుతూ చేతిలో చేయి వేసి మరీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. గతేడాది దీపావళి నాడు మోదీ కార్గిల్ లో పర్యటించారు. 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు ఆయన నివాళుర్పించారు. అనంతరం అక్కడి సైనికులతో వివరాలు తెలుసుకుని, దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
యుద్ధం కాదు శాంతి కావాలి
యుద్ధం వల్ల సమస్య పరిష్కారం కాదని, భారత్ అందుకు వ్యతిరేకమని చెప్పిన మోదీ అన్నారు. శాంతి, సామరస్యాల వల్లే భారత్ సుభిక్షంగా ఉంటున్నదని, అయితే మనం మరింత శక్తిమంతంగా తయారు కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నిరంతరం సరిహద్దుల్లో కాపలా కాస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా దేశ ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉన్న సైనికుల్ని కలుసుకునేందుకు.. ప్రతి దీపావళి నాడు ఒక్కో సరిహద్దు ప్రాంతంలో మోదీ పర్యటిస్తుంటారు. అందులో భాగంగానే ఈసారి హిమాచల్ ప్రదేశ్ కు చేరుకున్నారు. దేశ ప్రధానే నేరుగా తమ వద్దకు వస్తుండటంతో మన సైనిక బలగాల ఆత్మస్థైర్యం ఎంతగానో పెంచుతున్నది.