దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కు మన దేశంపై ఎప్పుడూ నమ్మకం లేదని.. నెహ్రూ, ఇందిర కాలం నుంచి ఇదే తీరు హస్తం పార్టీలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. దేశ శక్తి, సామర్థ్యాల పట్ల వాళ్లకు ఏనాడూ నమ్మకం లేదని, భారతీయులు నెమ్మదిగా, నిదానంగా పనిచేస్తారని సాక్షాత్తూ నెహ్రూనే అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉండి మరికొన్ని దశాబ్దాల పాటు ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నారంటూ మండిపడ్డారు.
విభజన రాజకీయాలా…
‘ఎన్నికల్లో ఓటమి కోసమే ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయి.. మైనారిటీల పేరిట ఎంతకాలం రాజకీయం చేస్తారు.. ఎంతకాలం విభజన రాజకీయాలు(Devide Politics) చేస్తారు.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వారసత్వ బాధితులు ఉన్నారు.. వారసత్వ రాజకీయాలే హస్తం పార్టీ దుకాణాన్ని మూసేస్తాయ్.. మల్లికార్జున ఖర్గే రాజ్యసభకు వెళ్తే, గులాం నబీ ఆజాద్ ఏకంగా పార్టీనే వదిలి వెళ్లిపోయారు.. నెహ్రూ, ఇందిరాగాంధీకి భారత్ శక్తి, సామర్థ్యాలపై అసలు నమ్మకమే లేదు.. భారతీయులకు నైపుణ్యం లేదని నెహ్రూ మొదటి సమావేశంలోనే అన్నారు.. ఇందిర కూడా ఆయన కంటే తక్కువేమీ కాదు.. భారతీయులకు ఆత్మన్యూనతాభావం ఎక్కువ అని అన్నారని’ మోదీ ఆనాటి విషయాల్ని పంచుకున్నారు.
Published 05 Feb 2024