కంటికి కునుకు లేకుండా దేశ సేవలో తరిస్తున్న సైనికుల(Army Personal) పట్ల మరోసారి ప్రధానమంత్రి తన అభిమానాన్ని చాటుకున్నారు. జవాన్లు ఎక్కడుంటే అదే అయోధ్య(Ayodhya) అని అన్నారు ‘ ప్రజలంతా రాముడు ఉన్న ప్రదేశాన్ని అయోధ్య అనుకుంటారు.. కానీ నాకు ఆర్మీ ఎక్కడుంటే అదే అయోధ్య.. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో యుద్ధాల్లో మన సైనికులు విజయాల్ని అందించారు.. శాంతిస్థాపనలో ప్రపంచవ్యాప్తంగా భారత్ గౌరవం పెరిగిందంటే అది దేశ సైనికుల వల్లే.. భారత్ భద్రంగా ఉందంటే బోర్డర్ లో ఉన్న మీ దయతోనే.. చివరకు హిమాలయాల్లో కూడా.. ఆర్మీ ఎక్కడుంటే అదే నాకు దేవాలయం వంటిది’ అంటూ మోదీ జవాన్లను పొగడ్తలతో ముంచెత్తారు.
సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులతో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి సైతం మోదీ సంబరాలు నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని హిమాలయ సానువుల్లో గల హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చా ప్రాంతానికి చేరుకున్న ఆయన.. అక్కడి సైనికులందరిని కలుసుకున్నారు. దేశానికి విశేష సేవలందిస్తున్న జవాన్లను కొనియాడుతూ చేతిలో చేయి వేసి మరీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. గతేడాది దీపావళి నాడు మోదీ కార్గిల్ లో పర్యటించారు. 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు ఆయన నివాళుర్పించారు. అనంతరం అక్కడి సైనికులతో వివరాలు తెలుసుకుని, దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.