మణిపూర్ ఇద్దరు మహిళలపై చోటుచేసుకున్న ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇది అమానవీయమని, ఈ విషయం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. దీనిపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలని కోరారు. 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. నిందితులను విడిచిపెట్టబోమని భారత ప్రజలకు భరోసా ఇస్తున్నానని చెప్పారు.
జాతి ఘర్షణలకు నిలయంగా మారిన మణిపూర్ లో ఇద్దరు మహిళలను కొంతమంది పురుషులు నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన మే 4న జరిగిందని ఆ రాష్ట్రానికి చెందిన ఇండిజీనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం(ITLF) తెలిపింది. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి పంట పొలాల్లో సామూహిక అత్యాచారం చేశారని తెలిపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తూ ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. సదరు వీడియో ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ వీడియో కలకలం రేపడంతో.. కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వీడియోను తొలగించాలంటూ ట్విటర్ సహా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు ఆదేశాలు జారీచేసింది. భారతదేశ చట్టాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.