
Published 17 Dec 2023
లోక్ సభలో చోటుచేసుకున్న దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. జరిగిన ఘటనపై ఆయన తొలిసారి పెదవి విప్పారు. ఈ విషయంలో మరో మాటకు తావులేదని, వాద, ప్రతివాదనలకు ఇది సరైన సమయం కాదని అన్నారు. ‘లోక్ సభలో జరిగిన దాడి విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.. నిండు సభలో అలా జరగడం నన్ను తీవ్రంగా కలచివేసింది.. దీన్ని రాద్ధాంతం చేస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడం సరికాదు.. ఇది అంత తేలిగ్గా విడిచిపెట్టే అంశం కాదు.. విమర్శలు, ప్రతివిమర్శలు మాని, ప్రతి ఒక్కరూ దీనికి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది.. అని ప్రధాని వివరించారు.
ఈ నెల 13న లోక్ సభ సందర్శకుల గ్యాలరీ(Visitors Gallery) నుంచి ఇద్దరు వ్యక్తులు లోపలికి దూకి గందరగోళానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సాగర్ శర్మ, మనోరంజన్ కిందకు దూకి సభలో నినాదాలు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. BJP MP ప్రతాప్ సింహ రికమెండేషన్ తో సభలోకి క్యానిస్టర్లతో ప్రవేశించి వాటిని వదలడంతో దట్టంగా పొగ వ్యాపించింది. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు నిర్వహించిన విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కఠినమైన సెక్షన్లు పెట్టారు. ఘటన జరిగిన ఐదో రోజు నాడు ప్రధాని దీనిపై తీవ్రంగా స్పందించారు.