
ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపుల పర్వానికి దూరంగా ఉండాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో కొందరు అనుసరిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలు జాతి మనుగడకే ప్రమాదకరమని అన్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన ‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న వేళ.. భోపాల్ పర్యటనలో ప్రధాని కీలక కామెంట్లు చేశారు. ‘యూనిఫాం సివిల్ కోడ్ ను సుప్రీంకోర్టు సైతం గుర్తు చేసింది. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దేశ ప్రజలందరికీ ఒకే రకమైన హక్కులుంటాయని భారత రాజ్యాంగం చెబుతున్నది. ఈ టైప్ పాలిటిక్స్ వల్ల వెనుకబడ్డ పస్మండా ముస్లింలను సైతం సమానంగా చూడలేకపోతున్నారని’ వివరించారు. లాస్ట్ ఇయర్ జరిగిన ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజంగఢ్, రాంపూర్ లోక్ సభ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీకి ఎనలేని ధైర్యం వచ్చిందన్నారు.

బీజేపీ వ్యతిరేకులపై కరుణ చూపాలి
ఉత్తర్ ప్రదేశ్, బిహార్ సహా సౌత్ ఇండియాలోని కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇలా అత్యధిక రాష్ట్రాల్లో బుజ్జగింపుల పర్వమే నడుస్తున్నది. యూనిఫాం సివిల్ కోడ్ పేరుతో కొందరిని రెచ్చగొట్టి లాభపడాలని చూస్తున్నారు. మీ కుమారులు, కుమార్తెలు, మనవళ్ల సంక్షేమం కావాలంటే బీజేపీకే ఓటు వేయండని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల కోసం కూటమి కట్టిన పార్టీల గురించి ప్రధాని చమత్కారంగా మాట్లాడారు. ‘మనం కోపంగా ఉండకూడదు.. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న వారి పట్ల కరుణతో ఉండాలని’ అన్నారు. 80-90 ఏళ్ల క్రితమే ఈజిప్టులో ట్రిపుల్ తలాక్ రద్దయిందని, ఆ నిబంధన ఇస్లాంలో భాగమైతే ఖతార్, జోర్డాన్, ఇండొనేషియా వంటి దేశాల్లో ఎందుకు నిషేధించారని మోదీ ప్రశ్నించారు.
ప్రజలే మా బలం
బీజేపీకి ప్రజలే పెద్ద బలం అని ప్రధాని గుర్తు చేశారు. ‘మేము ఎయిర్ కండిషన్డ్ రూముల్లో కూర్చుని ఆదేశాలు జారీచేయలేం.. ప్రజలతో కలిసి ఉండటానికి కఠినమైన వాతావరణాన్ని ఎంచుకుంటాం’ అని స్పష్టం చేశారు.