ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే రాష్ట్రంలో రెండు సార్లు పర్యటించిన ప్రధానమంత్రి మోదీ.. మరోసారి టూర్ కు వచ్చి మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ లో జరిగిన సభలకు మాత్రమే హాజరైన ఆయన.. ఇక జిల్లాల బాట పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు ఇప్పటికే రాష్ట్రంలో నామినేషన్లు, ప్రచార కార్యక్రమాలకు అటెండ్ కాగా.. ఇప్పుడు మోదీ సైతం జిల్లాల్లో నిర్వహించే సభలకు అటెండ్ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 25న రాష్ట్రానికి వచ్చి 26, 27 వరకు ఇక్కడే ఉండనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి.
రెండు జిల్లాల్లో సభలు
ప్రధాని మోదీ రాకతో రాష్ట్రంలో పార్టీ మరింతగా జనాల్లోకి వెళ్తుందని భావిస్తున్న కమలం లీడర్లు రెండు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. 25నాడు కరీంనగర్ లో, 26వ తేదీన నిర్మల్ లో జరిగే సభల్లో ఆయన ప్రసంగిస్తారు. మూడో రోజైన 27నాడు హైదరాబాద్ లో భారీ రోడ్ షో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.