
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. వర్గ కలహాలతో నిరాశ్రయులైన బాధితులను పరామర్శించేందుకు రాహుల్… రెండు రోజుల పర్యటన చేపట్టారు. గురువారం మణిపూర్ చేరుకున్న ఆయన… శుక్రవారం వరకు అక్కడే ఉండనున్నారు. పౌర సంఘాలతో సమావేశమై చర్చలు జరుపుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మే 3న అల్లర్లు, హింస చోటుచేసుకున్న తర్వాత ఈశాన్య రాష్ట్రానికి ఒక కాంగ్రెస్ నేత వెళ్లడం ఇదే తొలిసారి.
కాన్వాయ్ కి బ్రేక్
ఇంఫాల్ నుంచి చురాచంద్ పూర్ వెళ్తున్న రాహుల్ గాంధీ కాన్వాయ్ ని రాజధానికి 20 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపూర్ వద్ద పోలీసులు ఆపేశారు. బిష్ణుపూర్ జిల్లా ఉట్లూర్ వద్ద రోడ్డుపై టైర్లు కాలిపోవటం, పైగా అల్లరి మూకలు రాళ్లు విసురుతుండటంతో ముందు జాగ్రత్తగా కాన్వాయ్ ని ఆపామన్నారు. కాన్వాయ్ పై కొందరు రాళ్లు వేసినందున ముందుకు వెళ్లడం సరికాదంటూ పోలీసులు వారించారు. అయితే రాహుల్ యాత్ర కంటిన్యూ చేయడానికి సహకరించాలని కాంగ్రెస్ నేతలు… పోలీసులు, ఆర్మీ అఫీషియల్స్ ని కోరారు.

జాతి ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత
ఈశాన్య రాష్ట్రంలో మైతీ, కుకీ కమ్యూనిటీల మధ్య తలెత్తుతున్న ఘర్షణలతో రాజధాని ఇంఫాల్ సహా వివిధ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఈ సంవత్సరం మే లో జాతి కలహాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 100 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 వేల మంది నిర్వాసితులుగా మారగా… వారంతా 300 శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ST హోదా కోసం మైతీ కమ్యూనిటీ చేపట్టిన డిమాండ్ ను వ్యతిరేకిస్తూ కొండ జిల్లాలో యాత్ర నిర్వహించారు. ‘ఆదివాసీ సంఘీభావ యాత్ర’ నిర్వహించిన తర్వాత మే 3 నుంచి ఘర్షణలు మొదలయ్యాయి. మణిపూర్ జనాభాలో మైతీలు దాదాపు 53 శాతం వరకు ఉన్నారు. వీరంతా ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులు-నాగాలు-కుకీల జనాభా 40 శాతం వరకు ఉండగా.. వీరంతా కొండ జిల్లాల్లో ఉంటున్నారు. ఇలా రెండు తెగల మధ్య ఘర్షణ నెలకొనడంతో అపార ప్రాణనష్టం సంభవించింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర బలగాలు పెద్దసంఖ్యలో అక్కడ భద్రత కాస్తున్నాయి.