
Published 30 Dec 2023
అయోధ్యానగరి సకల జనపురిగా వినుతికెక్కే రోజుకు ముహూర్తం దగ్గర పడింది. శ్రీరామచంద్రమూర్తి కొలువైన మహాక్షేత్రం.. ప్రాణ ప్రతిష్ఠకు రంగం సిద్ధం చేసుకుంది. కనుల పండువగా సాగే వేడుకను తిలకించేందుకు విశ్వవ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్నారు. అలాంటి అయోధ్య నగరంలో వివిధ అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయోధ్య రాముడి ప్రాణపతిష్ఠ జరిగే జనవరి 22 నాడు దేశ ప్రజలందరూ తమ ఇళ్లల్లో ‘రామ జ్యోతి’ వెలిగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘హిందుస్థాన్ చరిత్రలో జనవరి 22 విశిష్టమైన రోజుగా నిలుస్తుంది… ఈ వేడుక కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది… అయోధ్యధామ్ లో ఎక్కడ చూసినా రామనామమే వినిపించాలి… త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి పేరుతో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించాం… ఈ విమానాశ్రయం ఏటా 10 లక్షల మందికి సేవలందిస్తుంది’ అంటూ ప్రధాని మోదీ గుర్తు చేశారు.
జాతికి అంకితం చేసిన పీఎం
రూ.240 కోట్లతో అభివృద్ధి చేసిన అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ తోపాటు మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ఎయిర్ పోర్టు కోసం రూ.1,450 కోట్లు వెచ్చించగా.. ఏటా 10 లక్షల మంది రాకపోకలకు వీలుగా విమానాశ్రయం తయారైంది. మోదీకి ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల మేర రోడ్ షో సాగింది. ఇప్పటివరకు వందే భారత్, నమో భారత్ రైళ్లు ప్రారంభించామని ఇక నుంచి అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని మోదీ వివరించారు.
మారుమూల క్షేత్రాలకు రైళ్లు
ప్రముఖ క్షేత్రాలే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలకు సైతం రైళ్ల సౌకర్యం కల్పిస్తామని మోదీ అన్నారు. త్వరలోనే మరిన్ని నగరాలకు వందే భారత్ రైళ్లతోపాటు గయ, లుంబిని, సారనాథ్, కపిలవస్తు క్షేత్రాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తమ హయాంలో ఇప్పటిదాకా ఉజ్వల పథకం కింద 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్న ప్రధాని… గత 65 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలు కేవలం 14 కోట్ల కనెక్షన్లు మాత్రమే ఇచ్చాయని గుర్తు చేశారు.