Published 22 Jan 2024
ముల్లోకాలు ముచ్చటపడేలా… వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ… చిరు దరహాసం, ప్రసన్న వదనంతో జానకిరాముడు(Janaki Ram) జన్మస్థలిలో కొలువయ్యాడు. దేశవ్యాప్తంగా మారుమోగుతున్న శ్రీరామనామ(Sri Rama Naamam) స్మరణ, జపంతో ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య(Ayodhya)లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అత్యంత వైభవోపేతంగా సాగింది. దీంతో ఐదు శతాబ్దాల తర్వాత అయోధ్యాపురిలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సోమవారం మధ్యాహ్నం 12:29 గంటలకు అభిజిత్ లగ్నం(Abhijit Lagnam)లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 84 సెకన్ల పాటు కనుల పండువగా కొనసాగింది. ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణం కలిగిన బాలరాముడు.. స్వర్ణ, వజ్ర వైఢూర్యాలతో సంతరించుకున్న రూపాన్ని దర్శించుకుని భక్త జనం పులకించిపోయారు.
ప్రధాని ప్రత్యేక పూజలు…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక పూజలతో శ్రీరామచంద్రమూర్తి బాల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శ్రీరామ కీర్తనలు, భజనలు నిర్వహించారు. ప్రధానితోపాటు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ సంచాలక్ మోహన్ భాగవత్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గర్భాలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గగన వీధుల నుంచి పూలు చల్లారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామచంద్రుడికి పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ఈ వేడుకలు తిలకించేందుకు దేశంలోని ప్రముఖులంతా హాజరయ్యారు. స్వామీజీలతో మోదీ ముచ్చటించారు.