రాజకీయ విశ్లేషణ(Political Strategies)ల్లో మేటి అయిన ప్రశాంత్ కిషోర్… ఐప్యాక్ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను అధికారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే చాలా రాష్ట్రాల్లో ముందస్తు పోల్స్ అంచనాలు అందుకున్నాయి. తాజాగా ఆయన మరో సంచలన విషయాన్ని పంచుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో BJPకి తిరుగులేదని స్పష్టం చేశారు.
దీదీకి చెక్…
పశ్చిమబెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. కానీ ఆమెకు కమలం పార్టీ చెక్ పెడుతుందని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. మొత్తంగా బెంగాల్ లో BJPది నంబర్ వన్ పొజిషన్ అని చెప్పారు. ‘మీరంతా ఆశ్చర్యపోతారు… బెంగాల్ గడ్డపై కమలం పార్టీదే నంబర్ వన్ పొజిషన్’ అంటూ స్పష్టతనిచ్చారు. ఒడిశాలోనూ ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుందన్న ఆయన.. ఇక మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుందన్నారు.
తెలంగాణలో…
తెలంగాణలో రెండో స్థానంలో ఇంకా కుదిరితే మొదటి స్థానంలో నిలిచేలా సీట్లను పువ్వు గుర్తు తెచ్చుకుంటుందని జోస్యం చెప్పారు. తాము 370 సీట్లు గెలుస్తామని ప్రధాని చెబుతుండగా… దక్షిణ, తూర్పు భారత్ కలిపి 2024 ఎలక్షన్లలో BJP మొత్తం దేశవ్యాప్తంగా 300 సీట్లు మాత్రమే గెలవబోతుందన్నారు PK. ఇంచుమించు 2019 ఎన్నికల మాదిరిగానే(303 సీట్లు 2019లో) ఈసారి కూడా ఉండబోతుందని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
భారీస్థాయిలో ఓట్లు…
2019 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(TMC) కన్నా 3% ఓట్లు మాత్రమే వెనుకబడింది పువ్వు గుర్తు. 2014లో కేవలం 2 సీట్లు, 16.84% ఓటింగ్ సాధించిన ఆ పార్టీ.. 2019కి వచ్చేసరికి ఓట్ల శాతాన్ని 40.25కు పెంచుకోగా, 18 మందిని గెలిపించుకుంది. అటు TMC మాత్రం 34 సీట్ల నుంచి 22కు పడిపోయింది. దీదీకి దీటుగా తయారైన కమలం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్ల నుంచి 77కు చేరుకుంది. 2016లో 10.16%గా ఉన్న అసెంబ్లీ ఓట్ల షేర్.. TMC-లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేసినా లాభం లేకపోగా 2021కి వచ్చేసరికి బీజేపీ ఓట్ల శాతం 38% చేరుకుంది.