మావోయిస్టు సానుభూతిపరుడి(Naxal Sympathizer)గా సెషన్స్ కోర్టు తీర్పునివ్వడంతో ఆరేళ్ల నుంచి జైలు జీవితం గడుపుతున్న ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా.. ఎట్టకేలకు విడుదలయ్యారు. బాంబే హైకోర్ట్(Bombay High Court) నాగపూర్ బెంచ్ తాజా తీర్పుతో ఆయన నాగపూర్ జైలు నుంచి రిలీజయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు మరో ఆరుగురికి గడ్చిరోలిలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు శిక్ష విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు, ఢిల్లీలోని ఆయన ఇంట్లో నక్సల్స్ సాహిత్యం దొరకడం సహా దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారంటూ ఆయన్ను అరెస్టు చేశారు. కేసును విచారించిన గడ్చిరోలి సెషన్స్ కోర్టు.. 2017లో సాయిబాబాను దోషిగా తేల్చి జీవిత ఖైదు(Life Imprisonment) విధిస్తే.. దీన్ని సాయిబాబా హైకోర్టులో సవాల్ చేశారు.
ఇష్టమొచ్చినట్లు…
అరెస్టు నుంచి విచారణ దాకా మహారాష్ట్ర పోలీసుల తీరుగా సరిగా లేదని నాగపూర్ బెంచ్ అభిప్రాయపడింది. ఉపా(UAPA) చట్టంలోని సెక్షన్ 45(1) కింద కేసు పెట్టి ఆధారాలు చూపకపోవడం మహారాష్ట్ర హోంశాఖ వైఫల్యమని తీర్పులో తెలియజేసింది. కేసులో ఏ1 నిందితుడు మహేశ్ కరిమన్ టిక్రీ, ఏ3 హేమ్ కేశవదత్త మిశ్రా, ఏ4 ప్రశాంత్ రాహి నారాయణ్ సాంగ్లీకర్, ఏ5 విజయ్ టిక్రీ, ఏ6 సాయిబాబాను నిర్దోషులుగా ప్రకటించింది. ఏ2 అయిన పాండు పొరా నరొటే.. విచారణ సమయంలోనై స్వైన్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తో విచారణ జరిపి శిక్ష పడ్డ మహారాష్ట్ర తొలి కేసుగా ఇది అప్పట్లో సంచలనానికి కారణమైంది.