‘నీట్’ పరీక్షల్లో లీకేజీ ఆరోపణలు.. UGC-Net లీకేజీ, రద్దు వంటి పరిణామాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిన్నట్నుంచి(జూన్ 21) కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(Prevention Of Unfair Means) యాక్ట్ ను అమల్లోకి తెస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేరం చేసినట్లు రుజువైతే ఈ చట్టం కింద పదేళ్ల జైలు, కోటి రూపాయల జరిమానా పడుతుంది. కేంద్రీయ విద్యాసంస్థల్లో చోటుచేసుకునే లీకేజీలకు సంబంధించి మోదీ సర్కారు ఫిబ్రవరిలో ఈ యాక్ట్ ను తెచ్చింది.
వేటికి వర్తిస్తాయంటే…
ఈ చట్టం తక్షణమే అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ స్పష్టం చేసింది. UPSC, స్టాఫ్ సెలక్షన్ కమిటీ(SSC), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB), IBPS, JEE, NEET, CUET సహా కేంద్రం పరిధిలోని అన్ని ప్రవేశ పరీక్షలు దీని కిందకు వస్తాయి. ఇందులో 2 రకాల శిక్షలున్నాయి. ముఠాలు, గ్రూపులు, మాఫియా వంటి నేరాలకు ఈ శిక్షలు అమలవుతాయి.
శిక్షలు ఇలా…
పేపర్లను ఇతరులతో రాయిస్తామంటూ పాల్పడే అక్రమాలకు రూ.10 లక్షల ఫైన్ తోపాటు 3 నుంచి 5 ఏళ్ల శిక్ష పడుతుంది. ఛీటింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి లీకేజీలకు 5-10 ఏళ్ల కారాగార వాసంతోపాటు రూ.కోటి వరకు జరిమానా వేస్తారు. ఈ యాక్ట్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించే సంస్థే అక్రమాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేరం రుజువైన సంస్థలకు కోటి ఫైన్ వేయడంతోపాటు వాటి ఆస్తులు జప్తు చేస్తారు.