మరో కీలకమైన సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డుమ్మా కొడుతున్నారు. ఇప్పటికే బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి నిరాకరించిన పుతిన్.. ఇప్పుడు జీ20 సమావేశానికి అటెండ్ కావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుతిన్ తో మాట్లాడారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే జీ20 సమావేశాలకు రావాలని పుతిన్ ను ఈ సందర్భంగా మోదీ కోరారు. అయితే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన పుతిన్.. తన తరఫున విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలిపారు. పరస్పర ద్వైపాక్షిక సంబంధాలపై ఇరుదేశాల అధినేతలు ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత జరిగిన ఏ ఇంటర్నేషనల్ మీటింగ్ కు పుతిన్ అటెండ్ కాలేదు. అమెరికా, యూరప్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించడంతోపాటు రష్యాతో వాణిజ్యాన్ని తెగతెంపులు చేసుకున్నాయి.
మరోవైపు పుతిన్ నాలుగు రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ కూ డుమ్మా కొట్టారు. ఇందుకు ప్రధాన కారణం.. పుతిన్ ను అక్కడ అరెస్టు చేసే అవకాశం ఉండటమే. ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారంటూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJలో ఆయనపై విచారణ జరిగింది. పుతిన్ ను అరెస్టు చేయాలంటూ ICJ తీర్పు నిచ్చింది. అయితే తమ అధినేతను అరెస్టు చేస్తామనటం మరో యుద్ధానికి సిద్ధమవడమేనంటూ రష్యా దీటుగా వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ ఒడంబడికలున్న దేశాల్లో ఎక్కడైనా పుతిన్ ను అరెస్టు చేసే అవకాశం ఉంది. అందుకే ఆయన దేశం విడిచి బయటకు రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అటు బ్రిక్స్ సదస్సుకు వెళ్తే ఏదైనా జరగొచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి. దీంతో పుతిన్ ఆ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు జీ20 సమావేశాలకు తాను అటెండ్ కావడం లేదంటూ స్వయంగా ఆయనే మోదీకి తెలియజేశారు.