Published 02 Jan 2024
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు(Truck Drivers) పట్టిన ఆందోళన బాటతో పొద్దున్నుంచి పెట్రోల్ బంకులన్నీ(Petrol Bunks) కిక్కిరిసిపోతున్నాయి. చాలా చోట్ల ‘నో స్టాక్’ బోర్డులే కనిపిస్తుండగా.. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనన్న సంశయం ఏర్పడింది. వందలాదిగా తరలివస్తున్న వాహనాలతో బంకుల వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. కానీ ఈ సమస్యలకు ఇక చెక్ పడబోతున్నది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించి ఎప్పట్లాగే విధుల్లో చేరిపోవడంతో.. ట్యాంకర్లన్నీ ఆయిల్ డిపోల నుంచి బయటకు వస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ రాత్రి కల్లా ట్యాంకర్ల ద్వారా పెట్రోల్, డీజిల్ బంకులకు చేరే అవకాశాలున్నాయి. ఈ రోజు రాత్రికి లేదంటే రేపు ఉదయం వరకు భారీ రద్దీ ఉన్నా ఈ ట్యాంకర్లు బంకులకు చేరుకునే టైమ్ ఆధారంగా రష్ క్రమంగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.
కేంద్రం తెచ్చిన చట్టంపై…
ఇండియన్ పీనల్ కోడ్(IPC) స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలోని రూల్ ప్రకారం ‘హిట్ అండ్ రన్’ అంటే వాహనం ఢీకొట్టి పారిపోయే డ్రైవర్లకు 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.7 లక్షల జరిమానా విధిస్తారు. ఈ నిబంధన వల్ల కొత్త వ్యక్తులు డ్రైవింగ్ వృత్తిలోకి రాబోరంటూ ట్రక్కు డ్రైవర్లంతా దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టడంతో వాహనాలు నిలిచిపోయి కొరత ఏర్పడింది. హిందుస్థాన్ పెట్రోలియం(HP), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(BPC), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) కంపెనీల నుంచి ట్యాంకర్ల డ్రైవర్లు బంకులకు బయల్దేరారు.