కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి ఆయనకు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాహుల్ పై అనర్హత వేటు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాల్లో మునిగిపోయింది. దిల్లీలోని AICC ఆఫీస్ వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు.
రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించడంతో ఆయనకు మార్గం సుగమమైంది. అయితే ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న అనుమానాలు కనిపించాయి. కానీ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ లోక్ సభ సెక్రటేరియట్.. రాహుల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నరేంద్ర మోదీని ఇంటి పేరుతో దూషించిన కేసులో సూరత్ సెషన్స్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని గుజరాత్ హైకోర్టులో సవాల్ చేస్తే అక్కడా రాహుల్ కు నిరాశే ఎదురైంది. సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించడంతో రాహుల్.. సుప్రీంను ఆశ్రయించారు. కింది కోర్టుల నిర్ణయం ఇంకా క్లారిటీగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డ సర్వోన్నత న్యాయస్థానం.. జైలు శిక్షపై స్టే విధించింది.