అప్పటిదాకా సాఫీగా సాగుతున్న ఆ రైలులో ఉన్నట్టుండి పొగలు వచ్చాయి. అప్పుడు సరిగ్గా ఆ ట్రెయిన్ ఓ బ్రిడ్జి(Bridge)పై ఉంది. పొగలు గమనించిన ప్రయాణికులు చైన్(Chain) లాగారు. వెంటనే అదే బ్రిడ్జిపై ట్రెయిన్ ఆగిపోయింది. ఏం జరుగుతుందోనన్న భయంతో కొందరు బ్రిడ్జి పైనుంచి నదిలోకి దూకారు. కానీ ఆ ట్రెయిన్ మాత్రం సురక్షితంగా బయల్దేరింది. ఆదివారం నాడు లఖ్ నవూ నుంచి చంఢీగఢ్ వెళ్తున్న సద్భావన ఎక్స్ ప్రెస్ బ్రేకులు జామ్ కావడంతో పొగలు వచ్చాయి. రైలులో మంటలు అంటుకున్నట్లుగా భావించిన ప్యాసింజర్స్ భయంతో గడగడలాడిపోయారు. రైసీ రైల్వేస్టేషన్ సమీపంలోకి చేరుకోగానే బాణ్ గంగా నదిపై ఆగిపోయింది. ఆ సమయంలో నది కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయినా ప్రయాణికులు బ్రిడ్జి అంచున ధైర్యంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకోవడానికి నదిలోకి దూకినట్లు అక్కడి వారు అంటున్నారు.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరుకుని బ్రేక్ ల్ని రిపేర్ చేశారు. అనంతరం రైలు అక్కడి నుంచి బయల్దేరింది. కానీ అక్కడ ఉన్నంతసేపు ప్రయాణికులు ఊపిరి బిగపట్టి కాలం గడపాల్సి వచ్చింది.