
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో మరో మహిళకు కీలక బాధ్యతలు దక్కాయి. రైల్వే శాఖలోనే అత్యంత కీలకమైన రైల్వే బోర్డుకు ఛైర్ పర్సన్ గా తొలిసారిగా ఓ మహిళ బాధ్యతలు చేపట్టారు. 118 ఏళ్ల రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ఛైర్ పర్సన్, CEOగా జయవర్మ సిన్హా ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న అనిల్ కుమార్ లహోటి పదవీకాలం పూర్తి కాగా.. జయవర్మ ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు. అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే రైల్వే బోర్డుకు ఒక మహిళ ప్రాతినిథ్యం వహించడం విశేష పరిణామం. 1905లో రైల్వే బోర్డు ఏర్పడగా అప్పట్నుంచి ఇప్పటివరకు మహిళలు ఆ పదవిలోకి రాలేదు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్(IRMS)కు చెందిన జయవర్మ.. జనవరిలో రైల్వే బోర్డ్ మెంబర్ గా నియామకమయ్యారు.
ఆపరేషన్స్, బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాల్ని బోర్డ్ మెంబర్ గా చూసేవారు. భారతీయ రైల్వేలో 35 ఏళ్ల నుంచి ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఆగ్నేయ, ఉత్తర, తూర్పు జోన్లలో బాధ్యతలు, బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలోని భారత హైకమిషన్ లో నాలుగేళ్లు రైల్వే అడ్వయిజర్ గా పనిచేశారు. ఆమె కాలంలోనే కోల్ కతా-ఢాకా మైత్రీ ఎక్స్ ప్రెస్ స్టార్ట్ అయింది.