అతడో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్. మూడు హత్య కేసుల్లో నిందితుడు కాగా… ఒక కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మరో కేసులో ఏకంగా… ఉన్నతాధికారి అయిన ASPతోపాటు మరికొందరు పోలీసులపైనా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇలా నాలుగు కేసుల్లోనూ ప్రమేయమున్న వ్యక్తి పేరు ముక్తార్ అన్సారీ. యూపీకి చెందిన ఈ మాఫియా డాన్ పేరు చెబితే అక్కడ హడల్. అవధేశ్ రాయ్ అనే వ్యక్తి కేసులో 1996 నాటి గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద నమోదైన కేసులో.. ఘాజీపూర్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష వేసింది. అలాంటి వ్యక్తికి జైలు నుంచి 5 కోర్టు వాయిదాలకు తీసుకెళ్లడంతోపాటు, న్యాయపోరాటం కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.55 లక్షలు ఖర్చు పెట్టారు. ఇప్పుడా డబ్బుల్ని వసూలు చేసే పనిలో ఉంది ప్రస్తుత ఆప్ సర్కారు.
అన్సారీని పంజాబ్ లోని రూప్ నగర్ జైలులో ఉంచారు. కానీ అక్కడ ఈయనకు రాజభోగాలు దక్కుతున్నాయి మరి. ఈ గ్యాంగ్ స్టర్ కోసం సదరు జైలులో ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ఆయన తరఫున వాదించేందుకు సుప్రీంకోర్టులో సైతం ఏకంగా ఓ స్పెషల్ లాయర్ ను నియమించి వాయిదాల కోసం కోర్టుకు తిప్పుతున్నారు. అలా ఒక్కో వాయిదాకు ఆ గ్యాంగ్ స్టర్ కు అయిన ఖర్చెంతో తెలుసా… అక్షరాలా రూ.11 లక్షలు. అలా ఇప్పటివరకు 5 వాయిదాలు పూర్తయితే అందుకు చెల్లించిన సొమ్ము… 55 లక్షల రూపాయలు.
స్వయంగా ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రకటించడమే అసలు విశేషం. ఇది జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో… సీఎం అమరీందర్ సింగ్ హయాంలో. ఇంతటి ఘనకార్యానికి పాల్పడ్డ అమరీందర్ సింగ్ నుంచే ఆ పైసలు వసూలు చేస్తామని చెబుతున్నారు ప్రస్తుత పంజాబ్ సీఎం. ట్రెజరీ నుంచి ఖర్చు చేసిన సొమ్ము మొత్తాన్ని అమరీందర్, నాటి జైళ్ల శాఖ మంత్రి సుఖ్ జిందర్ సింగ్ నుంచి రాబడతామంటున్నారు భగవంత్ మాన్.
ఒకవేళ సదరు మాజీ సీఎం, మాజీ మంత్రి గనుక డబ్బులు చెల్లించకపోతే వారికి వచ్చే పెన్షన్ తోపాటు ఇతర సదుపాయాల్ని రద్దు చేస్తామంటున్నారు మాన్. దీనిపై మండిపడ్డ అమరీందర్.. మాన్ కు అనుభవం లేకపోవడం వల్లే అలా మాట్లాడుతున్నారని అంటున్నారు. మొత్తానికి ఆ మాఫియా డాన్ ఓ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కావడం కొసమెరుపు.