దేశవ్యాప్తంగా నమోదవుతున్న మందిర్-మసీదు కేసులపై RSS చీఫ్ మోహన్ భగవత్ సంచలన రీతిలో మాట్లాడారు. కోర్టుల్లో కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూనే అయోధ్య రామ మందిర(Ram Mandir) నిర్మాణం తర్వాత ఇలాంటివి ఎక్కువయ్యాయన్నారు. ఇలాంటి కేసుల ద్వారా ద్వారా తాము హిందూ నాయకులు అవుతామని కొందరు భావిస్తున్నట్లుందన్నారు. ‘భారత్-విశ్వగురు’ అనే అంశంపై పుణెలో మాట్లాడిన భగవత్… భారతదేశం సామరస్యంతో జీవించగలదని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరముందని గుర్తు చేశారు. అయోధ్యలో రామ మందిరాన్ని హిందువులకే ఇవ్వాలని నిర్ణయించినా.. బ్రిటిషర్లు దాన్ని పసిగట్టి రెండు వర్గాల మధ్య చీలిక సృష్టించారని, దానివల్లే వేర్పాటువాదం ఆవిర్భవించి పాకిస్థాన్ ఏర్పడిందన్నారు.
ఇంకా ఏమన్నారంటే… ‘మనం చాలాకాలంగా సామరస్యంగా జీవిస్తున్నాం.. ఈ సామరస్యాన్ని ప్రపంచానికి అందించాలంటే దానికి ఒక నమూనా తయారు చేయాలి.. రామ మందిర నిర్మాణం తర్వాత హిందువులకు లీడర్లుగా మారవచ్చని కొందరు అనుకుంటున్నారు.. మందిర్-మసీదు వివాదాలు కొత్త కొత్త ప్రదేశాల్లో లేవనెత్తడం ఆమోదయోగ్యం కాదు.. ప్రతిరోజూ కొత్త వివాదం కనిపిస్తున్నది.. దీన్ని ఎలా అనుమతించాలి.. ఇది కొనసాగదు..’ అని అన్నారు. బయటి నుంచి వచ్చిన కొన్ని గ్రూపులు బలపడుతున్నాయని, మళ్లీ పాత పాలన రావాలని చూస్తున్నాయని భగవత్ అభిప్రాయపడ్డారు.