దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. ఈ సీజన్లో తొలిసారి ప్రమాదక స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3(GRAP-3)ను సర్కారు అమలు చేయనుంది. పొగమంచు వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడం, విమాన సేవలకు ఆటంకం కలగడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్(CAQM) గ్రాప్-3ని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
దీంతో ఈ GRAP-3 నిబంధనల ప్రకారం BS-3 పెట్రోలు వాహనాలు, BS-4కు చెందిన డీజిల్ వెహికిల్స్ ను ఢిల్లీలోకి అనుమతించబోరు. కాలుష్యం తీవ్రతతో ప్రాథమిక(Primary) పాఠశాలల్ని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఐదో తరగతి వరకు గల పిల్లలు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేకుండా కేవలం ఆన్లైన్ విధానంలోనే తరగతులు బోధించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ CM అతిశీ పేరిట ఆదేశాలు వెలువడగా.. తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు ఆన్లైన్ విధానాన్నే కొనసాగించబోతున్నారు. మరోవైపు భవనాల నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం పడింది.