
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో దారుణ మారణాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళల్ని పురుషుల గుంపు ఊరేగించి గ్యాంగ్ రేప్ కు పాల్పడిందన్న వార్త దేశమంతా సంచలనం రేకెత్తించగా.. తాజాగా ఒక వ్యక్తిని చంపి అతడి తలను వెదురుకర్రకు కట్టిన అమానవీయ ఘటన వెలుగుచూసింది. కుకీ వర్గానికి చెందిన ఈ మృతుడి వార్త ప్రస్తుతం కలకలం రేకెత్తిస్తోంది. ఈ రెండు ఘటనలు ఇలా ఉంటే మరో వార్త సైతం మణిపూర్ ను ఆందోళన రేకెత్తించేలా చేస్తోంది. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన రోజే మరో దుర్ఘటన జరిగినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇంఫాల్ లో కార్ వాష్ పని చేస్తున్న ఇద్దరు గిరిజన యువతులపై సామూహిక అత్యాచారం జరిగినట్లు బయటపడింది. తమ ఆఫీసులోనే ఈ దారుణ ఘటన జరగ్గా.. మే 4 నాడే ఆ యువతులపై దాడి చేసిన గుంపు వారి ప్రాణాలు తీసింది. సరిగ్గా అదే రోజు ఈ ఘటన జరిగిన ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలోనే మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన బయటపడింది. ఒళ్లు నిక్కబొడుచుకునే రీతిలో వింటేనే ఆశ్చర్యకరంగా ఉన్న ఈ ఘటనలో ఇద్దరు యువతుల్ని కొండ కింద పాతిపెట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఇంఫాల్ జిల్లాలోని కొనుంగ్ మమాంగ్ ఏరియాలో పనిచేస్తున్న ఆ యువతుల వయసు 21, 24 సంవత్సరాలు ఉంటుందని గుర్తించారు. జరిగిన దారుణంపై అందులో పనిచేస్తున్న మరో వ్యక్తి చెప్పడంతో విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆ ఇద్దర్ని జుట్టు పట్టుకుని రూమ్ లోకి ఈడ్చుకెళ్లి నోటికి గుడ్డలు కట్టారని, లైట్లు ఆర్పేసి గంటన్నర పాటు దారుణ మారణానికి పాల్పడ్డారని సదరు వ్యక్తి ఆ యువతుల కుటుంబాలకు తెలిపాడు. భయపడ్డ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై కంప్లయింట్ ఇచ్చేందుకు తొలుత ముందుకు రాలేదు. కానీ ఆ యువతుల్లో ఒకరి తల్లి ధైర్యం చేసి మే 16న సైకుల్ పోలీస్ స్టేషన్ లో జీరో FIRకు ముందుకు రావడంతో ఘటన వెలుగుచూసింది.