మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి ఇప్పటికే ED కస్టడీలో ఉన్న ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ పై మరో సంచలన వీడియో బయటకు వచ్చింది. ఇది అలాంటిలాంటి ఆరోపణ కాకుండా బాంబు పేలుళ్లకు పాల్పడ్డ దుండగుణ్ని కాపాడేందుకు డబ్బులు తీసుకున్నారన్నది ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఈ వీడియో విషయంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడం, అది విడుదల చేసిన వారు ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ‘ఆప్’ నేతలు దీన్ని ఖండించారు.
అసలేం జరిగిందంటే…
వేర్పాటువాద ఖలిస్థాన్ కు మద్దతుగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ నిషేధానికి గురైన సిఖ్స్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థ నుంచి అరవింద్ కేజ్రీవాల్ 16 మిలియన్ డాలర్లు(రూ.133.54 కోట్లు) తీసుకున్నారంటూ ఆ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నుమ్ ఆరోపిస్తున్న వీడియో బయటకు వచ్చింది. 2014లో న్యూయార్క్ లోని గురుద్వారా రిచ్ మండ్ హిల్స్ లో కేజ్రీవాల్ ను కలిశామని.. 2014 నుంచి 2022 వరకు ఎలక్షన్లలో పార్టీ ఫండ్ కింద ఈ మొత్తం అందజేశామని అందులో ఉంది. 1993 ఢిల్లీ బాంబు పేలుళ్లలో నేరస్థుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్న దేవీందర్ పాల్ సింగ్ భుల్లార్ ను విడిపించేందుకే ఈ మొత్తాన్ని అందించినట్లు వీడియోలో గుర్తించారు.
మరణశిక్ష జీవితఖైదుగా…
పంజాబ్ భటిండాలోని దయాల్పురా భేక్ ప్రాంతానికి చెందిన భుల్లార్.. ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి ఉగ్రవాద నిరోధక చట్టం(Terrorist And Disruptive Activities(Prevention)) కింద అరెస్టయ్యాడు. 2001లో భుల్లార్ కు మరణశిక్ష పడగా 2014 సుప్రీంకోర్టు దాన్ని జీవితఖైదుగా మార్చింది. భుల్లార్ కు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయాలంటూ 2014లో కేజ్రీవాల్.. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఢిల్లీ రాష్ట్ర మంత్రి కైలాస్ గెహ్లాట్ ఆధ్వర్యంలో 2024 జనవరిలో భేటీ అయిన ఏడుగురు సభ్యుల ఢిల్లీ ప్రభుత్వ శిక్ష సమీక్ష బోర్డు(Sentence Review Board).. భుల్లార్ వినతిని తోసిపుచ్చింది.
కేజ్రీవాల్ సర్కారే…
అతణ్ని ముందుగానే విడుదల చేయడం మంచిది కాదని.. భుల్లార్ బయటకు రావడం దేశ సార్వభౌమత్వం, సమైక్యతను దెబ్బతీయడమంటూ కమిటీ తేల్చిచెప్పింది. అంటే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆయన సర్కారే ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అటు తనను విడుదల చేసేలా ఉత్తర్వులివ్వాలంటూ ఈ నేరస్థుడు గతంలోనే పంజాబ్, హరియాణా హైకోర్టులో పిటిషన్ వేశాడు.
కానీ ఢిల్లీ సర్కారు కమిటీ తీసుకున్న నిర్ణయంతో తన పిటిషన్ ను వెనక్కు తీసుకున్నాడు. తమకు ఇచ్చిన మాటను మార్చిన కేజ్రీవాల్ తోపాటు పంజాబ్ CM భగవంత్ మాన్ ను చంపేస్తామని పన్నుమ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ కేజ్రీవాల్ జైలుకు వెళ్తే అక్కడ మా సోదరులు దాడి చేస్తారంటూ పన్నుమ్ అన్నారు. ఇలాంటి కరడుగట్టిన నేరస్థుణ్ని కాపాడేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించడం తాజాగా సంచలనానికి కారణంగా నిలిచినట్లు జాతీయ మీడియా అంటున్నది.