భానుడి భగభగలతో దేశమంతా అతలాకుతలం అవుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అంచనాల కన్నా ముందుగానే దేశవ్యాప్తంగా వర్షాలు(Rains) ఉంటాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు వాతావరణ శాఖ(Indian Meteorological Dept) ప్రకటించింది. అనుకున్న తేదీ కన్నా ముందే ఈ రుతుపవనాలు వివిధ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని చెప్పింది.
ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, అసోం, సిక్కింతోపాటు పశ్చిమబెంగాల్లోకి నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, కర్ణాటక ప్రాంతాల్లోకి ముందుగానే వస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే ఉత్తరాదితోపాటు పలు రాష్ట్రాల్లో 50 డిగ్రీలకు పైగా ఎండలు మండుతున్నాయి. వేడి, ఉక్కపోత ధాటికి ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే రుతుపవనాలు రావడంతో కాస్తయినా ఉపశమనం లభించే అవకాశాలున్నాయి.