
Published 26 Nov 2023
అసలే అది ప్రధాని టూర్. హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉన్నా వాతావరణం సరిగా లేకపోవడంతో రోడ్డుపై ప్రయాణించాల్సి వచ్చింది. కానీ మోదీ వస్తున్నారని తెలుసుకుని పెద్దసంఖ్యలో రైతులు రోడ్డుకు అడ్డం పడ్డారు. దీంతో తన టూర్ ను ఏకంగా ప్రధాని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన గతేడాది జనవరిలో పంజాబ్ లో జరగ్గా విధుల్లో నిర్లక్ష్యం చూపారంటూ ఆ జిల్లా SPని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం బఠిండా SPగా ఉన్న గుర్విందర్ సింగ్.. మోదీ టూర్ టైమ్ లో ఫిరోజ్ పూర్ SP(Operations)గా ఉన్నారు. జనవరి 5న పంజాబ్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ప్రధాని హెలికాప్టర్ లో కాకుండా వాహనాల్లోనే ఫిరోజ్ పూర్ బయల్దేరారు. ఫిరోజ్ పూర్ ఫ్లై ఓవర్(Fly Over)పైకి చేరుకోగానే అక్కడ వందలాది మంది రైతులు రోడ్డుపై అడ్డం పడ్డారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రధాని అక్కడే ఉండాల్సి రాగా.. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.
సుప్రీంకోర్టు నివేదిక ఆధారంగా
ప్రధాని వెనక్కు తిరిగిపోయిన ఘటనపై జనవరి 12న సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ నిర్వహించిన కమిటీ.. పోలీసుల డ్యూటీలో లోపాలున్నట్లు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ అందజేసింది. విధుల్లో గుర్విందర్ సింగ్ నిర్లక్ష్యంగా ఉన్నారంటూ మొన్నటి అక్టోబరు 18న పంజాబ్ ప్రభుత్వానికి DGP నివేదిక సమర్పించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా భగవంత్ మాన్ సర్కారు గుర్విందర్ పై చర్యలు తీసుకుంది.