
చంద్రయాన్-3తో మంచి జోరు మీదున్న ఇస్రో(ISRO) రానున్న రోజుల్లో భారీ స్థాయిలో ప్రయోగాలు చేపట్టబోతున్నది. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన టార్గెట్ విధించారు. స్పేస్ లోకి మనుషుల్ని పంపేందుకు ఉద్దేశించిన ‘గగన్ యాన్ మిషన్’ ఏర్పాట్లపై శాస్త్రవేత్తలు, అధికారులతో మోదీ రివ్యూ చేశారు. అంతరిక్షంలోకి మనుషులను పంపనున్న భారత్ తొలి మిషన్ 2025లో చేపట్టే అవకాశం ఉందని ప్రధానమంత్రి కార్యాలయం(PMO) వెల్లడించింది. రానున్న సంవత్సరాల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందని PM టార్గెట్ విధించారు. 20 ప్రయోగాలు, 3 మానవరహిత మిషన్లను ప్రయోగించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు.
2035 నాటికి స్పేస్ స్టేషన్
అంగారక గ్రహం పైకి ల్యాండర్ ను పంపించడంతోపాటు 2035 నాటికి అంతరిక్ష కేంద్రం(Space Station)ను ఏర్పాటు చేయాలన్నారు. 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుణ్ని పంపేలా ఏర్పాట్లుండాలని మోదీ సూచించారు. శుక్రగ్రహం వద్దకు ఆర్బిటర్ ను పంపించే మిషన్ పై ప్రయోగాలు సాగించాలని ఆదేశించారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తోపాటు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ పలు వివరాల్ని ప్రధానికి వివరించారు.