Published 19 Jan 2024
అయోధ్య(Ayodhya) రామ మందిర(Ram Mandir) ప్రతిష్ఠాపనకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా భక్తి భావం వెల్లివిరుస్తోంది. బాలరాముడి ప్రతిష్ఠాపన కోసం నిర్వహించే వేడుకలను తిలకించేందుకు అంతటా ఆసక్తి కనిపిస్తున్నది. ప్రజల భక్తిప్రపత్తులకు అనుగుణంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ నెల 22న ప్రత్యేక సెలవు ప్రకటించాయి. ఇప్పటికే మారిషస్ లాంటి దేశాలు సైతం సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు మన దేశంలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రామ మందిర వేడుక కోసం ప్రత్యేక సెలవు(Special Holiday)ను ప్రకటించాయి. గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, త్రిపుర, అసోం హాలిడే ఇచ్చాయి. ఇందులో కొన్ని రాష్ట్రాలు రోజంతా సెలవు ఇస్తే, మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఒక పూట హాలిడే ఇవ్వాలని నిర్ణయించాయి.
వివిధ సంస్థలు సైతం…
ఉద్యోగులకు ‘హాఫ్ డే హాలిడే’ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సెలవు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వ్యాపార, వాణిజ్య లావాదేవీలకు సంబంధించిన మార్కెట్లన్నింటికీ సెలవు ఇస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం ఈ పరిధిలోకి వస్తాయని క్లారిటీ ఇచ్చింది. భారత స్టాక్ మార్కెట్లు ఈ నెల 22 నాడు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా గల తమ కార్యాలయాలన్నింటి(Offices)కి సోమవారం నాడు హాలిడే ఉంటుందని రిలయన్స్ ప్రకటించింది.
మిగతా రాష్ట్రాల్లోనూ డిమాండ్లు…
ఇప్పటికే సెలవు ప్రకటించిన రాష్ట్రాలను పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ(BJP) పాలిత రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయి. హిందువులకు ప్రతీకగా భావించే అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన కోసం మిగతా రాష్ట్రాలు సైతం స్పందించాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ నెల 22 నాడు సెలవు ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్(VHP) డిమాండ్ చేసింది. మరి ఈ రెండు రోజుల్లో ఇంకెన్ని రాష్ట్రాలు సెలవు ప్రకటిస్తాయో చూడాల్సి ఉంది.