మరాఠా ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించడంతో CM కుర్చీపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. BJP-శివసేన-NCP కూటమిలో భాగంగా సొంతంగా 132 సీట్లు సాధించిన కమలం పార్టీకే ముఖ్యమంత్రి పదవి అన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇంతటి ఘన విజయం వెనుక మాజీ CM, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఇప్పటికే రెండుసార్లు CMగా సేవలందించిన ఆయన.. ముచ్చటగా మూడోసారి పదవి రేసులో ముందున్నారు. నరేంద్రమోదీ, అమిత్ షాకు అత్యంత విశ్వాసపాత్రుడన్న పేరు ఫడ్నవీస్ కు ఉంది.
27 ఏళ్లకే నాగపూర్ మేయర్ గా ఎన్నికై.. అత్యంత పిన్న వయసులో ఆ పదవి దక్కించుకున్న వ్యక్తిగా ఫడ్నవీస్ నిలిచారు. సౌమ్యుడిగా భావించే ఆయనపై చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకపోవడం ప్లస్ పాయింట్. ప్రస్తుతం శాసనసభాపక్ష నేత ఎన్నికపై మూడు వర్గాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ముంబయి దేవగిరి బంగ్లాలో అజిత్ పవార్ వర్గం, తాజ్ హోటల్లో షిండే వర్గం రేపు భేటీ అవుతున్నాయి. ఈ నెల 26తో అసెంబ్లీ గడువు ముగియనుండగా.. ఫలితాలు వచ్చిన 72 గంటల్లోపే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మూడు వర్గాలు ఎవరికి వారే తీవ్రస్థాయిలో మంతనాలు జరుపుతున్నాయి.