ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట(Stampede)లో 116 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరమైంది. ఈ ఘటన హత్రాస్(Hathras) జిల్లాలోని రతిభాన్పూర్ లో జరిగింది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా సత్సంగ్ నిర్విహస్తున్నారు. అసలీ సత్సంగ్ ఎందుకు పెట్టారు.. అది నిర్వహించిన బాబా ఎవరు.. ఎందుకిలా జరిగింది అన్న విషయాల్ని చూద్దాం…
భోలే బాబా…
భారీ జనంతో సత్సంగ్ నిర్వహించిన వ్యక్తి పేరు సకార్ విశ్వ హరి భోలే బాబా. ఈయన అసలు పేరు సౌరభ్ కుమార్(Saurabh Kumar). UPనే కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్ ల్లో ఈయనకు భారీ సంఖ్యలో భక్తులున్నారు. హత్రాస్ లో ప్రతి మంగళవారం సత్సంగ్ జరుగుతుంది. గతవారం మెయిన్ పురి జిల్లాలోనూ ఇలాంటి ఈవెంట్ జరిగింది.
ఆయనెవరంటే…
ఈ భోలే బాబా గతంలో UP పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. 17 ఏళ్ల సర్వీసును వదిలేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించారు. తెల్లని సూట్, టై కట్టుకునే ఈయన.. భక్తులకు బోధనలు వినిపిస్తుంటాడు. తన సతీమణి సకార్ విశ్వ హరి బాబా ఆఫ్ పటియాలితో కలిసి సత్సంగ్ లు నిర్వహిస్తుంటాడు. ఈ కార్యక్రమాలకు వేలాదిగా జనం వస్తుంటారు.
కరోనాలోనూ…
2022 మేలో పూర్తి కరోనా కాలంలోనూ ఫరూఖాబాద్ లో 50 మందితో సత్సంగ్ పెడతానంటూ పర్మిషన్ తీసుకుని 50 వేల మందిని రప్పించాడు. ఇది అప్పట్లో సంచలనంగా మారి అధికారులు తలలు పట్టుకున్నారు. ఇప్పుడీ సత్సంగ్ లో వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో జనమంతా అక్కణ్నుంచి వెళ్లడం మొదలైంది.
అయితే భోలే బాబా వెళ్లాకే అందరూ బయటకు పోవాలంటూ ఆపడంతోనే ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైందని అక్కడివారు అంటున్నారు.
మృతులకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.