గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు విధించిన అనర్హత మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించినట్లయింది. హైకోర్టు తీర్పుపై BKMR.. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాలపై స్టే వెలువడింది. దీనిపై అటు ఎన్నికల సంఘంతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. బ్యాంకు ఖాతాలు వెల్లడించకపోవడం తప్పేనన్న కృష్ణమోహన్ తరఫు న్యాయవాది.. సేవింగ్స్ అకౌంట్స్ కావడం వల్లే పూర్తి వివరాలు ఇవ్వలేకపోయామన్నారు. ఆ సేవింగ్స్ అకౌంట్స్ ఎమ్మెల్యే సతీమణి పేరుతో ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. అటు తన వాదనలు కూడా వినాలంటూ DK అరుణ.. సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు తీర్పు దృష్ట్యా గద్వాల MLAగా డీకే అరుణను గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) గెజిట్ రిలీజ్ చేసింది. గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న కారణంతో గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా పేర్కొంటూ అరుణను కొత్త ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. BRS అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డి 2018 ఎలక్షన్లలో పోటీ చేయగా… ఆయన గెలుపును సవాల్ చేస్తూ 2019లో అరుణ పిటిషన్ వేశారు. కృష్ణమోహన్ రెడ్డి తన ఆస్తులను పూర్తిగా వెల్లడించలేదని, కొన్నింటిని అఫిడవిట్ లో దాచిపెట్టారన్నది ఆమె ఆరోపణ. తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు గాను కృష్ణమోహన్ రెడ్డికి రూ.2.50 లక్షలను జరిమానాగా కోర్టు విధించింది. పిటిషనర్ అరుణకు ఖర్చుల కింద మరో రూ.50 వేలు చెల్లించాలని మొత్తంగా MLAకు రూ.3 లక్షల ఫైన్ వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే కొత్తగూడెం BRS MLA వనమా వెంకటేశ్వర్ రావుపై అనర్హత వేటు పడగా.. దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆర్డర్స్ పై సుప్రీం స్టే ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతుండగా.. తాజాగా BKMR విషయంలోనూ సుప్రీం స్టే ఇచ్చింది.