న్యాయస్థానంలో వాదనలు, న్యాయమే కాదు.. చక్కని ప్రవర్తన కూడా ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్(CJI) డి.వై.చంద్రచూడ్ గుర్తు చేశారు. ఎంత సీనియారిటీ ఉన్నా సిన్సియారిటీ లేకపోతే నడవదు అన్న రీతిలో అడ్వకేట్ కు చుక్కలు చూపించారు. ‘నీట్’ పిటిషన్లపై వాదనలు జరుగుతున్న సమయంలో ఈ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది.
ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్న సమయంలో ఆ లాయర్ చేసిన పని CJIకి కోపం తెప్పించింది. సీనియర్ అయిన నరేంద్ర హుడా వాదనలు వినిపిస్తున్న సమయంలో మరో సీనియర్ మాథ్యూస్ నెడుంపర అడ్డుకోవడం ప్రారంభించారు. హుడా వాదనల్ని అడ్డుకోవద్దంటూ తొలుత CJI వారించారు.
హుడా వాదనను పూర్తి చేయనివ్వండి.. ఆ తర్వాత మీ పాయింట్ చెప్పండని CJI అన్నారు. దీనిపై నెడుంపర.. ఈ కోర్టులో నేను సీనియర్ మోస్ట్ లాయర్ అని చెప్పడంతో CJI తీవ్రంగా ఆగ్రహించారు.
CJI డి.వై.చంద్రచూడ్, సదరు న్యాయవాది మాథ్యూస్ నెడుంపర మధ్య వాడీవేడిగా సాగిన సంభాషణ ఇలా…
మాథ్యూస్..: మీ ప్రశ్నకు నేను జవాబివ్వగలను.. ఇక్కడి లాయర్లందరిలో నేనే సీనియర్.. నేను అమికస్ క్యూరీ(కోర్టు సహాయకుడు)ని.
సీజేఐ..: లేదు.. నేనేమీ అమికస్(Amicus)ను నియమించలేదు.
మాథ్యూస్..: నేను మీ ప్రశ్నకు సమాధానమిస్తాను.
సీజేఐ..: ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలని నేను కోరుకోవడం లేదు.. కూర్చోండి.. లేదంటే మిమ్మల్ని కోర్టు నుంచి పంపిస్తాను.
మాథ్యూస్..: మీరు నన్ను గౌరవించకపోతే నేనే వెళ్లిపోతాను.
సీజేఐ..: మిస్టర్ హుడా వాదిస్తున్న సమయంలో ఎవరూ జోక్యం చేసుకోవడం నాకిష్టం లేదు.
మాథ్యూస్..: నేను ఒక్కటే చెప్పాలి.
సీజేఐ..: (సిబ్బందిని ఆదేశిస్తూ) దయచేసి సెక్యూరిటీని పిలవండి.. మిస్టర్ నెడుంపరను కోర్టు నుంచి పంపించివేయండి.
మాథ్యూస్..: నేను బయల్దేరుతున్నాను.. ఇది అన్యాయం.
సీజేఐ..: మిస్టర్ మాథ్యూస్.. మీరు చికాకు కలిగించకుండా నేను చూడగలను.. మీరు ఏ ఇతర న్యాయవాదికి ఆటంకం కలిగించకుండా చేయగలను.. ఈ కోర్టులో జరిగే ప్రక్రియకు నేను బాధ్యత వహిస్తాను.. గత 24 సంవత్సరాలుగా న్యాయవ్యవస్థను చూస్తున్నా.. నిబంధనల్ని ధిక్కరించే ఏ లాయర్ నూ నా కోర్టులో ఇంతవరకు అనుమతించలేదు, ఇక అనుమతించబోను.