ఎన్నికల బాండ్లను బహిర్గతం చేయాలంటూ ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)ని ఆదేశించిన సుప్రీంకోర్టు.. తన ఆదేశాల అమలులో చూపిన నిర్లక్ష్యంపై మండిపడింది. ఇష్టమొచ్చినట్లు, మీకు నచ్చిన విధంగా ఇవ్వడం మాని, మొత్తం వివరాలు ఈనెల 21 లోపు సమర్పించాలని ఆదేశించింది. ఈ విషయంలో SBI వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. బాండ్ నంబరుతోపాటు కొనుగోలుదారుల సమాచారం, డినామినేషన్లు, వాటిని నగదుగా మార్చుకున్న తీరుపై పూర్తిస్థాయిలో వివరాల్ని కేంద్ర ఎన్నికల సంఘాని(CEC)కి ఇవ్వాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది.
దాపరికం ఉంటే అంతే…
సమాచారం మొత్తం అందజేస్తున్నామని, దాచుకోవడానికి ఏమీ లేదన్న రీతిలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని తన ఆదేశాల్లో SBIకి సుప్రీం తెలియజేసింది. బ్యాంకు నుంచి అందిన సమాచారాన్ని వెంటనే వెబ్ సైట్(Website)లో అప్ లోడ్ చేయాలని ECని ఆదేశించింది. SBI అసంపూర్తి సమాచారం ఇవ్వడంపై ఈనెల 15న తీవ్రంగా ఆగ్రహించిన సుప్రీం బెంచ్… బాండ్ల నంబర్లపై క్లారిటీ లేకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ఈనెల 21లోపు SBI ఛైర్మన్.. ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఏమిటీ ఎన్నికల బాండ్…?
దేశంలోని రాజకీయ పార్టీల(Political Parties)కు విరాళాలు అందించేందుకు గాను ‘ఎలక్టోరల్ బాండ్ల’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టింది. పౌరులు, లేదా సంస్థలు అధీకృత బ్యాంకు నుంచి బాండ్లు కొనుగోలు చేసి నచ్చిన రాజకీయ పార్టీలకు ఇచ్చే విధంగా 2018 జూన్ 29 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ బాండ్లను SBI జారీ చేస్తుండగా, వచ్చిన నగదును ఆయా పార్టీలకు అందిస్తుంటుంది. KYC వివరాలు తీసుకుని, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నవారు ఈ బాండ్లు కొనుగోలు చేయవచ్చు. పారదర్శకంగా పార్టీలకు నిధులు అందించే కార్యక్రమంలో మొదలైన ఈ స్కీమ్ లో… దాతల వివరాలు మాత్రం వాటిపై ఉండవు.
రూ.1,000 నుంచి రూ.కోటి వరకు SBI బ్రాంచిల నుంచి కొనుగోలు చేయవచ్చు. వీటి కాల పరిమితి 15 రోజులు మాత్రమే కాగా, రిప్రజంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్(RPA) ప్రకారం నమోదైన పార్టీలకు మాత్రమే బాండ్లు అందజేసే వీలుంది. సాధారణ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓటు బ్యాంకు పొందిన పార్టీలకు మాత్రమే ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందించాలన్నది రూల్. సంవత్సరంలో నాలుగు సార్లు మాత్రమే(జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు) బాండ్లను అందుబాటులో ఉంచుతారు.
బాండ్లను కొని వివరాల్ని బయటపెట్టకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీనివల్ల బ్లాక్ మనీకి ఆస్కారం ఉందని, కార్పొరేట్ సంస్థలు దీన్ని దుర్వినియోగం చేస్తాయన్న ప్రచారం ఉంది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ADR), కామన్ కాజ్ స్వచ్ఛంద సంస్థలు 2017లో… సీపీఐ(ఎం) 2018లో పిటిషన్లు దాఖలు చేశాయి. పార్టీలకు ఇచ్చే భారీ డొనేషన్లతో అవినీతిని చట్టబద్ధం చేసినట్లవుతుందని, గోప్యతను పాటించడంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కల్పించిన పౌరుల హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు వాదించారు.
విదేశీ లాబీయిస్టులు తమ సొంత అజెండాతో భారత రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంటారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. భారతదేశంలో సబ్సిడరీలు కలిగిన విదేశీ సంస్థలు సైతం విరాళాలు అందించేందుకు FCRAలో సవరణలు చేయడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజకీయ విరాళాలు ఇచ్చే కంపెనీలు వాటిని బ్యాలెన్స్ షీట్లలో చూపించే అవసరం లేకుండా కంపెనీల చట్టం 2013లో సవరణలు తీసుకురావడం కూడా కరెక్ట్ కాదని పిటిషనర్లు వాదించారు.
ADR రిపోర్ట్ ప్రకారం దేశంలోని 7 జాతీయ పార్టీలు, 24 లోకల్ పార్టీలు 2016 నుంచి 2021 మధ్య ఐదేళ్ల కాలంలో మొత్తంగా రూ.9,188 కోట్లను బాండ్ల ద్వారా అందుకున్నాయి. మొత్తం నిధుల్లో 58% అంటే రూ.5,272 కోట్లు భారతీయ జనతా పార్టీకి అందగా, కాంగ్రెస్ పార్టీకి రూ.952 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్(TMC)కి రూ.767 కోట్లు ముట్టాయి.
పిటిషనర్ల వాదనలతో అటు ఎన్నికల సంఘం కూడా 2019లో వేసిన అఫిడవిట్ ద్వారా ఏకీభవించింది. చట్టాల్లో మార్పులను ఉపయోగించుకుని డొనేషన్స్ అందించడం కోసమే ‘షెల్’ కంపెనీలను సృష్టించే ప్రమాదముందని గుర్తు చేసింది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సైతం… బ్లాక్ మనీ, మనీ లాండరింగ్ జరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. దీంతో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం… వివరాలు బహిర్గతం చేయాలంటూ SBIని ఆదేశించింది.