కేరళ దళిత కుటుంబంలో జన్మించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన వ్యక్తి జస్టిస్ సి.టి.రవికుమార్. జువాలజీలో డిగ్రీ అయ్యాక న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. అలప్పుజ జిల్లా మవళైకర సమీపంలోని తళకార అనే కుగ్రామానికి చెందిన జస్టిస్ చుడలయిల్ తేవన్ రవికుమార్ రేపు(జనవరి 5న) రిటైరవుతున్నారు. CBI కేసుల్లో దర్యాప్తునకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదంటూ 3 రోజుల క్రితమే సంచలన తీర్పునిచ్చారు. క్రికెట్ ను అమితంగా ప్రేమించే జస్టిస్ రవికుమార్ ను CJI సంజీవ్ ఖన్నాతోపాటు న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు, బార్ అసోసియేషన్లు ఘనంగా సన్మానించాయి.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కపిల్ సిబల్ వంటి సీనియర్ న్యాయవాదులు జస్టిస్ రవికుమార్ సేవల్ని గుర్తు చేసుకున్నారు. మవళైకర జిల్లా కోర్టులో 1986లో ప్రాక్టీస్ మొదలుపెట్టి 1996లో కేరళ హైకోర్టుకు వెళ్లారు. అక్కడే 2009, జనవరి 5న న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021లో సర్వోన్నత న్యాయస్థాన జడ్జిగా బాధ్యతలు చేపట్టి.. మూడేళ్ల నాలుగు నెలల పాటు ఆ పదవిని అలంకరించారు. ఆయన సతీమణి సైరా రవికుమార్ సైతం కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుండగా, ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.