
Published 11 Dec 2023
ఆర్టికల్ 370 రద్దుపై అందరిలోనూ ఉత్కంఠ ఏర్పడిన వేళ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కీలక తీర్పునిచ్చింది. జమ్ముకశ్మీర్ కు సంబంధించి రాష్ట్రపతి నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని విస్పష్ట తీర్పును వెలువరించింది. దీంతో పిటిషనర్ల వాదనను తోసిపుచ్చుతూ కేంద్రం నిర్ణయంలో జోక్యానికి తావులేదని తెలియజేసింది. చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ తీర్పు కాపీని చదవగా… ఆర్టికల్ 370 రద్దు సరైనదేనంటూ ధర్మాసనం వెలువరించిన అభిప్రాయాన్ని వివరించారు. ఇప్పటికే జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, తీర్పు తీరుపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ కనిపించింది. ఐదుగురు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాల్ని తమ తీర్పులో తెలియజేశారు. గతంలో వచ్చిన తీర్పులను పిటిషనర్లు సవాల్ చేయలేదని, ఈ అంశంపై ఇప్పటికే మూడు తీర్పులు ఉన్నాయని CJ చంద్రచూడ్ తెలిపారు.
మిగతా రాష్ట్రాలతో సమానమే
భారత్ లో విలీనమైన తర్వాత జమ్ముకశ్మీర్ కూడా దేశంలో అంతర్భాగమేనని, అది అన్ని రాష్ట్రాలతో సమానమేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. తాత్కాలిక అవసరాల కోసం ఆర్టికల్ 370ని తీసుకువచ్చారని అభిప్రాయపడింది. యుద్ధ పరిస్థితుల వల్లే ఈ ఆర్టికల్ తెచ్చారని, దీనిపై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని కరాఖండీగా చెప్పింది. ఆర్టికల్ 370ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందన్న ధర్మాసనం.. భారత్ లో విలీనం తర్వాత ఆ రాష్ట్రానికి ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని తేల్చింది.
నాలుగేళ్ల క్రితమే ఆర్టికల్ రద్దు
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణం(Article)ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్ముకశ్మీర్ కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. దీనిపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ సాగిస్తున్నది. సెప్టెంబరు 5న తీర్పును రిజర్వ్ లో ఉంచిన బెంచ్.. ఈరోజు తీర్పు వెలువరిస్తామని ఇంతకుముందే ప్రకటించింది. చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ BR గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పును ప్రకటించింది.