‘ఇలాంటి బ్రిలియంట్ ఐడియాలు మీకెలా వస్తాయ్.. మీ పిటిషన్లు(PILs) ఇంట్రెస్టింగ్ గా ఉంటాయ్.. మీరు రాజకీయ రంగంలోకి ఎందుకు వస్తున్నారు.. 3 లక్షల మంది అనాథలు(Orphans), 40 మంది వితంతువుల(Widows) రక్షించిన సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న మీరు పాలిటిక్స్ లోకి రావడమంటే.. ఇప్పటిదాకా మీరు నిర్వర్తించిన బాధ్యతలకు పాలిటిక్స్ పూర్తి భిన్నం కదా..’ అంటూ కేఏ పాల్ కు సుప్రీంకోర్టు చురకలంటించింది. పేపర్ బ్యాలెట్లను వాడే అమెరికా వంటి దేశాల్ని అనుసరించాలని, EVM ట్యాంపరింగ్ పై ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారని పాల్ తెలియజేయడంతో.. మిగతా ప్రపంచం నుంచి మనం ఎందుకు భిన్నంగా ఉండకూడదనుకుంటున్నారు అంటూ మొట్టికాయలు వేసింది.
దేశంలో బ్యాలెట్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టేలా ECని ఆదేశించాలని, EVMలను చంద్రబాబు, జగన్ సైతం వ్యతిరేకించారంటూ పాల్ పిటిషన్ వేశారు. పరిశీలించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ‘ఎన్నికల్లో గెలిస్తే EVMలు బాగా పనిచేసినట్టు, ఓడిపోతే ట్యాంపరింగ్ జరిగినట్లు.. గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా.. దీన్ని ఎలా చూస్తాం.. మీరు వాదించే స్థలం ఇది కాదు..’ అంటూ పిటిషన్ను తిరస్కరించింది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే ఐదేళ్లపాటు అనర్హులుగా ప్రకటించాలని కూడా ఆయన పిల్ వేశారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న బెంచ్.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయంటూ పిటిషనర్ కు చురకలంటించింది.