కోల్ కతా ఆర్.జి.కర్(RG Kar) ఆస్పత్రి ట్రెయినీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య కేసుపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఘటన జరిగిన 12 గంటల తర్వాత F.I.R. నమోదు కావడమేంటంటూ మమతాబెనర్జీ సర్కారుపై మండిపడింది. ఇద్దరు సుప్రీం లాయర్లు, తెలంగాణకు చెందిన డాక్టర్ రాసిన లేఖల్ని పరిగణలోకి తీసుకుంది. CJI డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది.
‘F.I.R.లో హత్య ప్రస్తావన ఉందా.. ఆ అంశం లేదనే మేం అనుకుంటున్నాం.. హత్యను ఎఫ్ఐఆర్లో ఎందుకు ప్రస్తావించలేకపోయారు.. మొదట ఆత్మహత్యగా చెప్పడానికి ప్రిన్సిపల్ ప్రయత్నించారని ఒక రిపోర్ట్ మా వద్ద ఉంది..’ అంటూ CJI సీరియస్ అయ్యారు. హాస్పిటల్ పై జరిగిన దాడితో సాక్ష్యాలు తారుమారైనా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన ధర్మాసనం.. ఈ విషయంలో పశ్చిమబెంగాల్ సర్కారు తీరును ఎండగట్టింది.
డాక్టర్ల భద్రతపై నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సుప్రీం.. 10 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. అందులో ఇద్దరు తెలుగు డాక్టర్లు ఉన్నారు.